భద్రాద్రిలో భారీ ఎన్‌కౌంటర్.. 12 మంది మావోల మృతి - MicTv.in - Telugu News
mictv telugu

భద్రాద్రిలో భారీ ఎన్‌కౌంటర్.. 12 మంది మావోల మృతి

March 2, 2018

తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దు నెత్తురోడింది. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా వెంకటాపురం మండలం తడపలగుట్ట- ఛత్తీస్‌గఢ్‌‌లోని పూజారికాంకేడు నడుమ శుక్రవారం పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎన్ కౌంటర్లో12మంది మావోయిస్టులు మృతిచెందారు. మృతుల్లో తెలంగాణ మావోయిస్టు కార్యదర్శి మావోయిస్టు అగ్రనేత హరిభూషణ్‌ ఉన్నట్లు తెలుస్తోంది. గ్రేహౌండ్స్‌కు చెందిన ముగ్గురు పోలీసులు గాయపడ్డారు.  ఈ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం అందడంతో కేంద్ర భద్రతా దళాలుతెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు కూంబింగ్ చేశారు. వారికి మావోయిస్టులు తారసపడ్డంతో కాల్పులు జరిగాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని పోలీసులు చెబుతున్నారు. కొందరు మావోయిస్టులు తప్పించుకుని పోయారని, వారి కోసం గాలిస్తున్నామని తెలిపారు. తీవ్రంగా గాయపడిన ఒక పోలీసులు హెలికాప్టర్‌ ద్వారా భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఘటన  స్థలానికి పెద్ద సంఖ్యలో పోలీసులను తరలిస్తున్నారు. జయశంకర్‌ భూపాలపల్లి ఎస్పీ, ఓఎస్డీ సంఘటనా ప్రాంతానికి బయలుదేరారు. మావోయిస్టులకు గత డిసెంబర్లోనూ ఎదురుదెబ్బ తగిలింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి సమీపంలోని బోడు అటవీ ప్రాంతంలో పోలీసులు 8 మంది నక్సల్స్ను చంపేశారు.

బూటకం.. పట్టుకొచ్చి చంపారు..

ఎన్‌కౌంటర్ బూటకమని విప్లవ రచయితల సంఘం నేత వరవరరావు ఆరోపించారు. ఇన్‌ఫార్మర్లు ఇచ్చిన సమాచారంతో  మావోయిస్టులను ఎక్కడి నుంచో  పట్టుకొచ్చి దారుణంగా హింసించి, తర్వాత కాల్చి చంపారని హైదరాబాద్‌లో విలేకర్లతో అన్నారు. ఈ బూటకపు  ఎన్‌కౌంటర్‌పై తక్షణమే న్యాయవిచారణ జరిపించి, బాధ్యులైన పోలీసులను కఠినంగా శిక్షించాలి సర్కారును ఆయన డిమాండ్ చేశారు.