ధోని ఖేల్ ఖతం..సంకేతాలిస్తున్న బీసీసీఐ! - MicTv.in - Telugu News
mictv telugu

ధోని ఖేల్ ఖతం..సంకేతాలిస్తున్న బీసీసీఐ!

January 16, 2020

bv

బీసీసీఐ గురువారం ప్రకటించిన వార్షిక కాంట్రాక్ట్ జాబితాలో మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ పేరు లేదు. ఈ విషయం ధోని అభిమానులతో పాటు యావత్ క్రికెట్ అభిమానిని కంగుతినేలా చేసింది. టీమిండియాకి ఆడుతున్న క్రికెటర్లని ఏ+, ఏ, బి, సి కేటగిరీలుగా విభజించిన బీసీసీఐ.. మొత్తం 27 మంది క్రికెటర్లకి సెంట్రల్ కాంట్రాక్ట్ ఇచ్చింది. కానీ.. ఎందులోనూ ధోనీకి చోటు లభించలేదు. దీంతో ధోని భవితవ్యంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గత ఏడాది వార్షిక కాంట్రాక్ట్‌లో ధోనీ A కేటగిరీ ఉన్నాడు. టీమిండియా తరఫున ఆడే ఆటగాళ్లకి వార్షిక వేతనం రూపంలో బీసీసీఐ డబ్బు చెల్లిస్తుంది. 

తాజాగా బీసీసీఐ విడుదల చేసిన జాబితాలో ఏ+ కేటగిరీలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రా చోటు దక్కింది. వారికి 2019 అక్టోబరు నుంచి 2020 సెప్టెంబరు మధ్యకాలానికి సంబంధించి వార్షిక వేతనం రూపంలో రూ. 7 కోట్లని బీసీసీఐ చెల్లిస్తుంది. అలానే ఏ కేటగిరీలో ఉన్న 11 మందికి రూ.5 కోట్లు, బి కేటగిరీలోని 5 మందికి రూ. 3 కోట్లు, సి కేటగిరీలోని 8 మందికి కోటి రూపాయలు చెల్లిస్తుంది. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌లో లేని క్రికెటర్ టీమిండియా తరఫున మ్యాచ్‌లు ఆడటానికి అర్హుడే. కాకపోతే.. అతనికి వార్షిక వేతనం మాత్రం లభించదు. మ్యాచ్ ఫీజు, ఇతర అలవెన్సులు మాత్రమే బీసీసీఐ అందజేస్తుంది. సెంట్రల్ కాంట్రాక్ట్‌లో ఉన్న క్రికెటర్ ఒకవేళ మ్యాచ్‌లు ఆడకపోయినా..? అతనికి లభించే వార్షిక వేతనం వస్తుంది. గత ఏడాది జులై నుంచి ధోని జట్టుకి దూరంగా ఉంటున్న ఉంటున్నాడు. అలాగే తన రిటైర్మెంట్‌పై బీసీసీఐకి స్పష్టత ఇవ్వడం లేదు. మరోవైపు భారత సెలక్టర్లు కూడా అతడి గురించి ఆలోచించడం మానేశారు. త్వరలో జరుగనున్న ఐపీఎల్ సీజన్‌లో ధోని రాణిస్తే.. అక్టోబరులో జరిగే టీ20 వరల్డ్‌కప్‌ టీమ్‌లోకి ఎంపిక చేసుకుంటామని బీసీసీఐ యాజమాన్యం గతంలో తెలిపినట్టు సమాచారం. దీంతో పొమ్మనలేక పొగబెడుతున్నారని ధోని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.