వైద్య విద్యార్థిని ప్రీతి అంత్యక్రియలు ముగిశాయి. స్వస్థలం జనగామ జిల్లా కొడకండ్ల మండలం గిర్నీ తండాలో అంత్యక్రియలను జరిగాయి. గాంధీలో పోస్ట్ మార్టం అనంతరం పోలీసు బందోబస్తు మధ్య ప్రీతి మృతదేహాన్ని గిర్నీ తండాకు ఉదయం తీసుకొచ్చారు. ప్రీతి మృతదేహాన్నిచూసి ప్రజలు బోరున విలపించారు. ప్రీతి భౌతికకాయం వద్ద ఆమె కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. అనంతరం మధ్యాహ్నం ప్రీతి మృతదేహానికి వారి పొలాల వద్ద అంత్యక్రియలు నిర్వహించారు.
ప్రీతి అంత్యక్రియల్లో సమీప గ్రామస్తులు, వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నేతలు, విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు. భారీగా తరలివచ్చిన స్నేహితులు ప్రీతికి కన్నీటి వీడ్కోలు పలికారు. ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ప్రీతి పాడెను మోశారు. ప్రీతి అంత్యక్రియల్లో అటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
వరంగల్ కేఎంసీలో పీజీ చదువుతున్న ప్రీతి ఈనెల 18వ తేదిన సీనియర్ మహ్మద్ సైఫ్ వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నం చేసుకుంది. విషపూరిత ఇంజక్షన్ చేసుకుని అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. మొదట వరంగల్‌లో చికిత్స అందించి..పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ నిమ్స్ కు తరలించారు. ఆమెను రక్షించేందుకు వైద్యుల శతవిధాలా ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఆదివారం ఉదయం ఆమె బ్రెయిన్ డెడ్ కాగా..రాత్రి 9.గంటల 10నిమిషాల సమయంలో చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు.