ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నోటీసులు జారీ చేసింది. గురువారం విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. హైదరాబాద్ బిజినెస్ మేన్ అరుణ్ రామచంద్ర పిళ్లైతో కలిపి కవితను ప్రశ్నించనున్నట్లు సమాచారం. ఈ కేసులో రామచంద్ర పిళ్లై.. కవితకు బినామీ అని ఈడీ మంగళవారం సీబీఐ ప్రత్యేక న్యాయస్థానానికి తెలిపిన విషయం తెలిసిందే. ఆప్ నేతలకు రూ.100 కోట్ల ముడుపులు ముట్టజెప్పిన సౌత్‌గ్రూప్ గుప్పిట్లో ఉన్న ఇండోస్పిరిట్స్ సంస్థలో కవిత తరఫున అరుణ్ భాగస్వామిగా ఉన్నారని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ఆమెకు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.
చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్ కల్పించాలంటూ ఈనెల 10వ తేదీన ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో ధర్నాకు పిలుపునిచ్చారు ఎమ్మెల్సీ కవిత. ఈ నేపథ్యంలో 10వ తేదీనే విచారణకు హాజరు కావాలంటూ ఈడీ నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. కాగా ఈ మద్యం కుంభకోణం కేసులో మొదటి నుంచి కవిత అభియోగాలు ఎదుర్కొంటున్నారు.