MLC Kavita : కవిత ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న ఈడీ
ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు సుదీర్ఘంగా విచారిస్తున్నారు. శుక్రవారం ఉదయం దాదాపు 11.30 గంటల ప్రాంతంలో ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో మొదలైన విచారణ ఇప్పటికీ కొనసాగుతోంది. భోజన విరామం కోసం మధ్యాహ్నం బయటికి వచ్చిన కవిత మళ్లీలోనికి వెళ్లారు. ఆమె వాడుతున్న మొబైల్ ఫోన్‌ను తమకు స్వాధీనం చేయాలని ఈడీ అధికారులు కోరగా ఆమె తన వ్యక్తిగత సిబ్బంది దగ్గరున్న ఫోన్‌ను అప్పగించారు. ఆ ఫోన్ డేటాను ఈడీ అధికారులు పశీలిస్తున్నారు. కేసులో అక్రమాలకు సంబంధించిన డేటా ఉన్న పది ఫోన్లను కవిత పగలగొట్టారనే ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. ఆ ఫోన్లలో డేటాను రిట్రీవ్ చేసి ఆమెకు చూపించినట్లు తెలుస్తోంది. కవితను అరెస్ట్ చేస్తే భారీ నిరసన తెలపాలని వందలమంది బీఆర్ఎస్ కార్యకర్తలు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి తలెత్తకుండా ఈడీ ఆఫీసు పరిసరాల్లో 144 సెక్షన్ విధించారు.
మరోపక్క.. కవితను విచారించకకుండా ముద్దుపెట్టుకుంటారా అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ మహిళా నేతలు రాజ్ భవన్ చేరుకున్నారు. అయితే గవర్నర్ అనుమతించకపోవడంతో రోడ్డుపైనే బైఠాయించి ఆందోళన తెలుపుతున్నారు. దీంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి.