Engineering marvel-Bhupen Hazarika
mictv telugu

 ఇంజనీరింగ్ అద్భుతం-భూపేన్ హజారికా

November 16, 2022

ప్రపంచ చరిత్రని మార్చిన ఇంజనీరింగ్ అద్భుతాల్లో వంతెనది కీలకపాత్ర. దూరాల తీరాల్ని కలిపే బ్రిడ్జి అంటే… రెండు ప్రపంచాల్ని ఏకం చేసే శక్తి. సమస్యల లోయల్ని దాటడానికి స్ఫూర్తి. ఇండియాలో అత్యంత పొడవైన భూపేన్ హజారికా వారధిని ఇంజనీరింగ్‌ అద్భుతంగా ప్రపంచం గుర్తిస్తోంది. ఈ బ్రిడ్జి ఇప్పుడు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తోంది.

దేశంలోనే అత్యంత పొడవైన వంతెనగా అసోంలోని భూపేన్ హజారికా సేతు నిలుస్తోంది. అసోం-అరుణాచల్ ప్రదేశ్‌ రాష్ట్రాల అనుసంధానం ఈ బ్రిడ్జి. అంతకంటే ముఖ్యంగా చైనాకి చెక్‌ పెట్టడానికి నిర్మించిన వ్యూహాత్మక వారధి ఇది. 60 టన్నుల బరువున్న ట్యాంకుల్ని కూడా తట్టుకునేలా దీన్ని నిర్మించారు.

అసోంలోని ధోలా నుంచి అరుణాచల్ ప్రదేశ్‌లోని సదియా వరకు నిర్మించిన వంతెనే భూపేన్ హజారికా సేతు. మన దేశంలో నీటిపై నిర్మించిన అతి పొడవైన బ్రిడ్జి ఇదే. అస్సాం- అరుణాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాల్ని అనుసంధానిస్తున్న ఈ వంతెన పొడవు 9.15 కిలోమీటర్లు. రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలకు మాత్రమే కాకుండా దేశ రక్షణలో కీలకమైన సేవలందించడానికి కూడా తోడ్పడుతుందన్న భావనతో ఈ వంతెనను నిర్మించారు. దీన్నే ధోలా సదియా బ్రిడ్జి అని కూడా పిలుస్తున్నారు.
60 టన్నుల బరువు ఉండే భారీ యుద్ధ ట్యాంకులను సైతం తట్టుకునేలా పటిష్టంగా తీర్చిదిద్దారు ఈ బ్రిడ్జిని. భారత సైన్యంలోని అర్జున్‌, టీ-72 వంటి యుద్ధ ట్యాంకులను ఈ వంతెన ద్వారా సరిహద్దుకు సులువుగా తరలించవచ్చు. అరుణాచల్‌ ప్రదేశ్‌ తమదేనంటూ చైనా పదే పదే కవ్వింపులకు పాల్పడుతోంది. ఈ కవ్వింపులకి చెక్ పెట్టాలంటే ఇక్క రవాణా స్పీడప్ చేయాలి. ఈ వ్యూహంతోనే భూపేన్ హజారికా వంతెన నిర్మించారు. కీలకమైన సమయాల్లో మన సైనికులను సత్వరమే తరలించడానికి ఈ వారధి ఎంతగానో ఉపయోగపడుతుంది.

పూర్తిగా స్తంభాలపై నిర్మించిన భూపేన్‌ హజారికా సేతు అస్సాంలోని ఉత్తర ప్రాంతాన్ని అరుణాచల్‌ ప్రదేశ్‌లోని తూర్పు ప్రాంతాన్ని కలుపుతుంది. టిబెట్‌లో పుట్టి అరుణాచల్‌లో అడుగుపెట్టే లోహిత్‌ నది అసోంలో బ్రహ్మపుత్రలో కలుస్తోంది. అరుణాచల్‌ప్రదేశ్‌లోని బౌద్ధారామాలను, ప్రకృతి అందాలను, అంతర్జాతీయ సరిహద్దును వీక్షించాలనుకునే పర్యాటకులు ఈ వంతెన మీదుగా వెళ్లవచ్చు.

భూపేన్‌ హజారికా వంతెనని హైదరాబాద్‌కు చెందిన నవయుగ ఇంజినీరింగ్‌ కంపెనీ నిర్మించింది. 2011 నవంబరులో నిర్మాణ పనులను ప్రారంభించి 2017లో పూర్తి చేసింది. నిర్మాణం కోసం దాదాపు వెయ్యి కోట్లు వెచ్చించారు. అస్సాంకి చెందిన కవి, రచయిత, సంగీతకారుడు, నేపథ్య గాయకుడు, నటుడు, నిర్మాత, భారత రత్న భూపేన్‌ హజారికా పేరును ఈ వంతెనకు పెట్టారు. స్వయంగా ప్రధాని మోడీ చేతుల మీదుగా ఈ బ్రిడ్జి ప్రారంభమైంది.

భూపేన్ హజారికా ఒక్కటే కాదు మన దేశంలో ఇంకా చాలానే బ్రిడ్జిలు ఉన్నాయి. ఒక్కో వంతెన ఒక్కో ప్రత్యేకతతో వెలిగిపోతూనే ఉన్నాయి. ముందే చెప్పినట్టు మానవ మేథస్సు సృష్టించిన అదభుతాల్లో ఈ వంతెనలు ఒకటి. ఇవి అన్ని రకాలుగా దేశానికి అందాన్ని, బలాన్ని కూడా చేకూరుస్తాయి.