England batters Netherlands; Slams World Record 498/4 in 50 overs
mictv telugu

వన్డేల్లో వరల్డ్ రికార్డ్.. ఇంగ్లాండ్ @498

June 17, 2022

England batters Netherlands; Slams World Record 498/4 in 50 overs

వన్డేల్లో వరల్డ్‌ రికార్డ్‌ని ఇంగ్లాండ్ టీమ్ మరోసారి బద్దలుకొట్టింది. నెదర్లాండ్స్‌తో శుక్రవారం జరుగుతున్న తొలి వన్డేలో ఆకాశమే హద్దుగా చెలరేగిన ఇంగ్లాండ్ టీమ్.. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా ఆమ్‌స్టెల్‌వీన్‌ లో జరుగుతున్న తొలి వన్డేలో 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి ఏకంగా 498 పరుగుల భారీ స్కోరు చేసింది. తద్వారా పరిమిత ఓవర్ల క్రికెట్ లో గతంలో తన పేరిట ఉన్న అత్యధిక స్కోరు (481) రికార్డును తుడిపేసింది. ఇంగ్లాండ్ మరో రెండు పరుగులు గనక చేసిఉంటే వన్డే క్రికెట్ చరిత్రలో 500 పరుగులు చేసిన తొలి క్రికెట్ జట్టుగా చరిత్ర సృష్టించేది.

తొలి వన్డేలో టాస్ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన ఇంగ్లాండ్ జట్టు.. నెదర్లాండ్ కు చుక్కలు చూపెట్టింది. ఆ జట్టులో ఫిలిప్ సాల్ట్ (93 బంతుల్లో 122.. 14 ఫోర్లు, 3 సిక్సర్లు), డేవిడ్ మలన్ (109 బంతుల్లో 125.. 9 ఫోర్లు, 3 సిక్సర్లు) , జోస్ బట్లర్ (70 బంతుల్లో 162 నాటౌట్.. 7 ఫోర్లు, 14 సిక్సర్లు)లు సెంచరీలు చేశారు. చివర్లో లివింగ్ స్టోన్ కూడా రెచ్చిపోయి ఆడటంతో ఇంగ్లాండ్ భారీ స్కోరు చేసింది.

వన్డేల్లో అత్యధిక స్కోర్లు ఇంగ్లాండ్ టీమే. 2018, జూన్ 19న ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో ఇంగ్లాండ్ టీమ్ 6 వికెట్ల నష్టానికి 481 పరుగులు చేయగా.. శుక్రవారం వరకూ ఈ రికార్డ్ టాప్. కానీ.. ఈరోజు 498 పరుగులతో ఇంగ్లాండ్ తన రికార్డ్‌ని తానే తిరగరాసింది. ఇక మూడో స్థానంలో పాకిస్థాన్‌పై 2016, ఆగస్టు 30న ఇంగ్లాండ్ చేసిన 444 పరుగుల రికార్డ్ ఉంది.