మహిళా క్రికెటర్లలో లెస్బియన్ వివాహాలు పెరిగిపోతున్నాయి. గతంలో న్యూజిలాండ్‌కు చెందిన ఏమీ సట్టర్ వైట్, ల్యూ తహుహులు 2017లో పెళ్లి చేసుకున్న తొలి మహిళా క్రికెటర్లుగా రికార్డు సృష్టించారు. అంతేకాక, తొలిసారి పాపకు జన్మనిచ్చిన తొలి లెస్బియన్ జంటగా కూడా నిలిచారు. అనంతరం దక్షిణాఫ్రికాకు చెందిన మరిజాన్ కాప్, డేన్ వాన్ నీకెర్క్లు వివాహం చేసుకున్నారు.
వారి బాటలోనే పయనిస్తూ ఇప్పుడు ఇంగ్లాండ్‌కు చెందిన కేథరిన్ బ్రుంట్, నాట్ స్కీవర్లు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరి నిశ్చితార్ధం 2019 అక్టోబరులో జరుగగా, 2020 సెప్టెంబరులో వివాహం చేసుకోవాలని ప్లాన్ చేసుకున్నారు. అయితే కరోనా రావడంతో వివాహం ఆలస్యమైంది. దీంతో 2022 మే 29న పెళ్లి చేసుకున్నారు. ఈ విషయాన్ని ఇంగ్లాండ్ మాజీ క్రికెట్ ప్లేయర్ ఇసా గుహ ఇన్స్టాగ్రాం ద్వారా వెల్లడించారు. దీంతో ఇంగ్లాండ్ క్రికెట్ బోర్టు కూడా కొత్తగా పెళ్లి చేసుకున్న లెస్బియన్ జంటకు శుభాకాంక్షలు తెలిపింది. వీరిద్దరూ 2017లో జరిగిన మహిళల ప్రపంచకప్‌లో మంచి ప్రదర్శన కనబరిచారు. 2022లో ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో స్కీవర్ 148 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది. స్కీవర్ ఇప్పటివరకు 7 టెస్టులు, 89 వన్డేలు, 91 టీ20లు ఆడింది. కేథరిన్ బ్రుంట్ 14 టెస్టులు, 140 వన్డేలు, 96 టీ20లు ఆడింది.