England scientists conducted research on a hundred pregnant women
mictv telugu

గర్భస్థ శిశువులకు ఏ ఆహారం ఇష్టమో తెలుసా.. ఆధారాలతో బయటపడ్డ నిజం

September 23, 2022

గర్భిణీ స్త్రీలు మంచి పోషకాలతో కూడిన బలవర్ధక ఆహారం తీసుకోవాలని డాక్డర్లు సూచిస్తుంటారు. మంచి ఆహారం వల్ల పిండానికి శారీరక బలంతో పాటు మానసిక వికాసానికి తోడ్పడుతుందనే భావనతో అలా చెప్తుంటారు. ఇది మనకు తెలిసిందే అయినా తినే ఆహారాన్ని బట్టి పిండాల మూడ్ మారిపోతుందని కొత్తగా పరిశోధనలో తేలింది. నచ్చిన ఆహారం తీసుకున్నప్పుడు ఆనందంగా ఉండడం, నచ్చని ఆహారం తీసుకుంటే బాధపడడం వంటివి చేస్తాయని తాజాగా రుజువైంది. దీన్ని ఇంగ్లండ్ శాస్త్రవేత్తలు ఆధారాలతో సహా నిరూపించారు.

ఆధారాలు కలిగిన అల్ట్రా సౌండ్ రిపోర్టును వారు విడుదల చేశారు. వారు నిర్వహించిన పరిశోధన ప్రకారం.. వంద మంది గర్భిణులను ఎంపిక చేసి వారిని మూడు గ్రూపులుగా విభజించారు. ఒక గ్రూపుకు కాకరకాయ, మరో గ్రూపుకు క్యారెట్, ఇంకో గ్రూపుకు ఏ ఫ్లేవర్ లేని క్యాప్సూల్స్ పెట్టారు. తర్వాత 20 నిమిషాలకు 4డీ అల్ట్రా సౌండ్ స్కానింగ్ పరీక్షలు నిర్వహించి వాటి రిపోర్టులను విశ్లేషించారు. ఇందులో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. కాకరకాయ క్యాప్సుల్స్ తిన్న గ్రూపుకు చెందిన గర్భస్థ శిశువుల మొఖాలు బాధతో, దిగాలుగా ఉండడాన్ని గమనించారు. క్యారెట్ ఫ్లేవర్ శిశువులు ఆనందంతో ఉన్నట్టు గుర్తించారు. ఏ ఫ్లేవర్ లేని క్యాప్సూల్స్ తిన్న శిశువులు కూడా ఆనందంగా ఉన్నట్టు తేలడంతో తల్లులు తీసుకున్న తీసుకునే ఆహారానికి శిశువులు స్పందిస్తున్నట్టు స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను మీడియాకు రిలీజ్ చేశారు. కాబట్టి ఆరోగ్యంతో పాటు ఆనందాన్ని ఇచ్చే ఆహారాన్ని గర్భిణీ స్త్రీలు తీసుకోవాలని, వాటి ప్రభావం శిశువులపై ఉంటుందని వారు సూచిస్తున్నారు.