england won by 4 wickets vs srilanka
mictv telugu

సెమీస్‌కు ఇంగ్లాండ్..వరల్డ్ కప్ నుంచి ఆసీస్ ఔట్

November 5, 2022

టీ 20 వరల్డ్ కప్‌లో సెమీస్‌కు ఇంగ్లాండ్ దూసుకెళ్లింది. కీలక మ్యాచ్‌లో శ్రీలంకపై నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. శ్రీలంక నిర్దేశించిన 142 పరుగుల లక్ష్యాన్ని ఆరు వికెట్లు కోల్పోయి 19.4 ఓవర్లలో చేధించింది. ఇంగ్లాండ్ విజయంతో ఆస్ట్రేలియా ఇంటి ముఖం పట్టింది. నెట్‌ రన్‌రేట్‌‌లో ఇంగ్లాండ్ కన్న వెనుకబడిన ఆస్ట్రేలియా టోర్ని నుంచి నిష్క్రమించక తప్పలేదు.

టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 141 పరుగులు చేసింది. ఆ టీమ్ ఓపెనర్ నిస్సాంకా 67 పరుగులతో రాణించాడు. కె.మెండీస్(18), రాజపక్స(22) తప్ప మిగతా బ్యాట్స్ మెన్స్ ఎవరూ రెండంకల స్కోరు చేయలేకపోయారు. ఇంగ్లాండ్ బౌలర్లలో మార్క్‌వుడ్ 3 వికెట్లతో రాణించగా, స్టోక్స్, వోక్స్, సామ్ కర్రన్, అదిల్ రషీద్ తలో వికెట్ దక్కించుకున్నారు..

142 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ ఓపెనర్లు బట్లర్, హేల్స్ మంచి ఆరంభాన్ని అందించారు. బౌలర్లపై ఎదురుదాడి చేస్తూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు.ఈ క్రమంలో 23 బంతుల్లో ఒక సిక్స్, 2 ఫోర్లతో 28 పరుగులు చేసిన జోస్ బట్లర్ ఔటయ్యాడు ఆ తర్వాత హేల్స్ (30 బంతుల్లో 47 పరుగులు) కూడా పెవిలియన్ చేరడంతో స్కోర్ బోర్డు నెమ్మదించింది. బ్రూక్స్, లివింగ్ స్టోన్ తక్కువ పరుగులకే వెనుదిరిగారు. కానీ బెన్ స్టోక్స్ (36 బంతుల్లో 44 నాటౌట్) రాణించి ఇంగ్లాండ్‌కు విజయాన్ని అందించాడు. ఇంగ్లాండ్ సెమీస్‌కు వెళ్లగా ఆస్ట్రేలియాకు నిరాశే ఎదురయింది.