రావల్పిండి వేదికగా పాకిస్తాన్ తో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ అనూహ్యంగా విజయాన్ని దక్కించుకుంది. డ్రా అవుతుందనుకున్న మ్యాచ్ లో అద్భుతం చేసిన ఆ జట్టు 74 పరుగుల తేడాతో గెలిచింది. దీంతో 22 ఏళ్ల తర్వాత పాక్ గడ్డపై ఇంగ్లండ్ తొలిసారి టెస్టు మ్యాచ్ గెలిచినట్టైంది. 343 పరుగుల టార్గెట్ తో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్తాన్ 268 పరుగులకు ఆలౌట్ అయింది. చివర్లో పదో వికెట్ పడిపోకుండా టెయిలెండర్లు చాలా సేపు జాగ్రత్తగా ఆడారు. ఇంగ్లండ్ కూడా వికెట్ కోసం తీవ్రంగా శ్రమించింది.
ఎట్టకేలకు స్పిన్నర్ లీచ్.. నషీమ్ షాను ఎల్బీగా ఔట్ చేయడంతో పర్యాటక జట్టు సంబరాల్లో మునిగిపోయింది. ఈ మ్యాచులో సెంచరీలు, పరుగుల పరంగా అనేక రికార్డుల నమోదవగా, టీమిండియా లెజెండరీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే రికార్డు బ్రేక్ అయింది. ఇంగ్లండ్ సీనియర్ బౌలర్ జేమ్స్ అండర్సన్ రెండో ఇన్నింగ్స లో రెండో వికెట్ తీసి 957 వికెట్లతో కుంబ్లే రికార్డు 956 వికెట్లను అధిగమించాడు. అత్యధిక వికెట్ల జాబితాలో మూడో స్థానానికి ఎగబాకాడు. మూడు ఫార్మాట్లలో కలిపి అత్యధిక వికెట్లు ముత్తయ్య మురళీధరన్ (1347), షేన్ వార్న్ (1001), అండర్సన్ (959), అనిల్ కుంబ్లే (956) లు ఉన్నారు. వీరిలో అండర్సన్ మాత్రమే ప్రస్తుతం క్రికెట్ ఆడుతుండడంతో అతని ఖాతాలోకి మరిన్ని వికెట్లు చేరే అవకాశం ఉంది. ఇక ఈ విజయంతో మూడు టెస్టుల సిరీస్ లో 1 – 0 ఆధిక్యంలో ఇంగ్లండ్ ఉంది. రెండో టెస్ట్ డిసెంబర్ 9న జరుగనుంది.