ఏ కల కూడా సాధించలేనంత పెద్ది కాదు. ‘మీరు కలలుగన్నట్లయితే.. దాన్ని మీరు పూర్తి చేయగలరు’ అని వాల్ట్ డిస్నీ చెప్పినట్లు ఈ ఢిల్లీ మహిళ చేసి చూపించింది. ఆమె స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
బ్రిగేడియర్ సంజయ్ ఖన్నా ఒక రోజు టీ తాగడానికి బయటకు వెళ్లాడు. అక్కడ ఒక మహిళ టీ అమ్ముతున్నది. ఆమె స్పష్టమైన ఇంగ్లీష్ మాట్లాడడం చూసి ఆశ్చర్యపోయాడు. ఆమెను అడిగి ఆమె కథను లింక్డ్ ఇన్ లో పోస్ట్ చేశాడు. ఆర్మీ వెటరన్ రాసిన ఆ స్ఫూర్తిదాయకమైన కథ మీకోసం..
‘ఏ ఉద్యోగమూ చిన్నది లేదా పెద్ది కాదు కానీ ప్రతీ ఒక్కరూ పెద్దగా కలలు కనాలి!’ అంటూ క్యాప్షన్ పెట్టి..
‘కొన్ని రోజుల క్రితం నేను ఢిల్లీ కాంట్ గోపీనాథ్ బజార్ లో ఉన్నాను. ఆ సమయంలో టీ తాగాలనుకున్నాను. అక్కడ స్మార్ట్ ఇంగ్లీష్ మాట్లాడే మహిళ చిన్న చాయ్ స్టాల్ ను నడుపుతూ ఉండడం చూసి ఆశ్చర్యపోయాను. నాకు ఆమె ఎందుకు అలా చేస్తుందని తెలుసుకోవాలని అనుకున్నాను. కారణాన్ని అడిగాను. అంతటా ఉన్న ప్రసిద్ధ టీ సెటప్ అయిన చైయోస్ లా పెద్ది చేయాలనే ఆలోచన, కల తనకు ఉందని ఆమె చెప్పింది. ఆమె పేరు శర్మిష్ట ఘోష్ అని చెప్పింది. అంతేకాదు.. ఆమె ఆంగ్ల సాహిత్యంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసింది. తన కలను కొనసాగించడానికి బ్రిటీష్ కౌన్సిల్ లైబ్రరీలో ఉద్యోగాన్ని వదులుకొని వచ్చేసింది.
ఆమె స్నేహితురాలు లుఫ్తాన్సాతో పని చేస్తున్న భావనా రావు కూడా ఈ చిన్న చాయ్ స్టాల్ నిర్వహణలో ఉమ్మడి భాగస్వామి. ఈ స్టాల్ లో సహాయానికి ఒకరిని నియమించుకుంది. వారు సాయంత్రం కలిసి వచ్చి తాత్కాలిక రకమైన నిర్మాణం లో ఈ స్టాల్ పెట్టారు. నేను ఈ పోస్ట్ తన అనుమతితోనే పెడుతున్నా. ఫోటో కూడా ఆమెదే. ఇతరులను ప్రేరేపించడానికి ఇలాంటి వారిని తప్పనిసరిగా హైలైట్ చేయాలి. కలను సాకారం చేసుకునేందుకు కృషి చేయాలనే అభిరుచి, చిత్తశుద్ధి ఉండాలి. నిరాశలో ఉండి, వృత్తిపరమైన స్థాయికి తగిన ఉద్యోగం కోసం వెతుకుతున్న చాలామంది అధిక అర్హత కలిగిన యువతకు ఆమె ఆదర్శం’ అంటూ రాశారు బ్రిగేడియర్ సంజయ్ ఖన్నా. ఆమె కథనం ఇప్పుడు వైరల్ గా మారింది. ఇంటర్నెట్ లో ప్రజల నుంచి ప్రశంసలను పొందుతున్నది. చాలామంది ఆమె ప్రయత్నాలు ఫలించాలని ఆశిస్తున్నారు. మనమూ కూడా ఆమె సక్సెస్ సాధించాలని ఆశిద్దాం!!