చూస్తూ ఊరుకోన్నది చాలు.. ఇక ముందుకు రండి: ప్రియాంక చోప్రా - MicTv.in - Telugu News
mictv telugu

చూస్తూ ఊరుకోన్నది చాలు.. ఇక ముందుకు రండి: ప్రియాంక చోప్రా

April 9, 2022

ప్రియాంక చోప్రా

బాలీవుడ్ యాక్టర్ ప్రియాంక చోప్రా ప్రపంచ దేశాలకు ఓ పిలుపునిచ్చారు. అందరం కలిసి ఉక్రెయిన్ దేశాన్ని ఆదుకుందాం రండి అంటూ కోరారు. ఉక్రెయిన్ దేశంపై రష్యా దురాక్రమణ నేపథ్యంలో శరణార్థుల పరిస్థితిపై ఆమె శనివారం వీడియో రూపంలో స్పందించారు. ఈ సందర్భంగా యునిసెఫ్ సౌహార్ద్ర రాయబారి హోదాలో ఉన్న ప్రియాంక.. అంతర్జాతీయ నేతలకు పిలుపునిచ్చారు.

ఆ వీడియోలో ప్రియాంక చోప్రా మాట్లాడుతూ.. ”రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మళ్లీ ఆ స్థాయిలో ఉక్రెయిన్‌లోని పిల్లలు చెల్లాచెదురవుతున్నారు. ఉక్రెయిన్ శరణార్థులను ఆదుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది. ప్రపంచ నాయకుల్లారా.. మనం ఇన్ని రోజులు చూస్తూ ఊరుకోన్నాం. ఇక ఎంతమాత్రం చూస్తూ ఊరుకోనేది లేదు. శరణార్థులకు అండగా నిలిచి, వారికి అవసరమైన సహాయం చేయడానికి ముందుకు రండి. వస్తారా కదా” అంటూ ప్రియాంక చోప్రా ఓ వీడియో సందేశం వెలువరించారు. ఈ మేరకు ప్రపంచస్థాయిలో విరాళాల కోసం అభ్యర్థన చేశారు. అంతేకాకుండా స్పందించే దాతల కోసం యునిసెఫ్ విరాళాల లింక్‌ను కూడా ఆమె వీడియోలో పొందుపరిచారు.

 

మరోపక్క ఉక్రెయిన్‌లో ప్రస్తుతం అత్యంత దయనీయ పరిస్థితులు దర్శనమిస్తున్నాయి. రష్యా సేనల నుంచి ప్రాణాలు కాపాడుకోవడం ఒకెత్తయితే, ఆకలి, నిత్యావసరాల లేమి, పొరుగు దేశాలకు వలస బాట, ఆపై శరణార్థుల సమస్యలు మరో ఎత్తుగా కనిపిస్తున్నాయి. ఇటువంటి సమయంలో బాలీవుడ్ హీరోయిన్ ఉక్రెయిన్ దేశానికి అండగా నిలవాలి అంటూ ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు.