EPFO withdrawal norms for EPS-95 subscribers relaxed
mictv telugu

ఉద్యోగులకు శుభవార్త.. ఈపీఎస్ నుంచీ డబ్బు తీసుకోవొచ్చు

November 1, 2022

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. విత్‌డ్రా నిబంధనలను సవరించింది. ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ 199 (ఈపీఎస్ 95)లో జమ అయిన డబ్బులను కేవలం ఆరు నెలల సర్వీస్ కలిగిన వారు విత్‌డ్రా చేసుకోవడానికి ఈపీఎఫ్‌వో అనుమతి ఇచ్చింది. దీని వల్ల కొంత మందికి ప్రయోజనం కలుగనుంది. ప్రస్తుతం ప్రావిడెంట్ ఫండ్ సబ్‌స్క్రైబర్లు ఆరు నెలల కన్నా తక్కువ సర్వీస్ కలిగి ఉంటే.. కేవలం ప్రావిడెంట్ ఫండ్‌లో ఉన్న డబ్బులను మాత్రమే విత్‌డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంది. అంటే ఈపీఎస్ 95 డబ్బులను తీసుకోవడానికి ఛాన్స్ ఉండేది కాదు. కేంద్ర కార్మిక శాఖ మంత్రి భుపేంద్ర యాదవ్ సారథ్యంలోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) తన 232వ సమావేశంలో ఈపీఎస్ ఖాతాదారులకు కూడా విత్ డ్రా చేసుకునే అవకాశమివ్వాలని నిర్ణయం తీసుకుంది. సోమవారం జరిగిన ఈ మీటింగ్‌లో రూల్స్‌ను సవరిస్తున్నట్లు సీబీటీ వెల్లడించింది.

కాగా, 34 ఏండ్లకుపైగా ఈ పథకంలో ఉంటున్నవారికి దామాషా పెన్షనరీ ప్రయోజనాలను ఇవ్వాలని కూడా సీబీటీ కేంద్రానికి సిఫార్సు చేసింది. దీంతో పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు రిటైర్మెంట్‌ ప్రయోజనాన్ని నిర్ణయించే సమయంలో అధిక పెన్షన్‌ రానున్నది. ఎక్స్ఛేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్‌(ఈటీఎఫ్‌) యూనిట్లలో ఉన్న పెట్టుబడులను ఉపసంహరించుకునే రిడమ్షన్‌ పాలసీకి సైతం అనుమతినిచ్చారు. సమాజంలోని అన్ని వర్గాలకు ప్రపంచ స్థాయి సామాజిక భద్రత అందించడంలో ఈపీఎఫ్‌వో ప్రపంచ ప్రమాణాలకు అనుగుణమైన కీలక వ్యూహాలను కూడా బోర్డు చర్చించింది. అలాగే ఈపీఎఫ్ మినహాయింపు రద్దు కోసం 11 ప్రతిపాదనలకు బోర్డు ఆమోదం తెలిపింది.