దసరా పండగకు ఈ బొమ్మలేంది.. సినీ కంపెనీ సారీ! - MicTv.in - Telugu News
mictv telugu

దసరా పండగకు ఈ బొమ్మలేంది.. సినీ కంపెనీ సారీ!

October 22, 2020

పండగలు, దేవుళ్లు, మతాచారాలు, సాంప్రదాయాల విషయంలో ఏదైనా మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎప్పుడు ఎవరి మనోభావాలు దెబ్బతింటాయో.. తదనుగుణంగా అలాంటి వ్యాఖ్యలు వివాదాస్పదం అవడం తెలిసిందే. తాజాగా ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ ఈరోస్‌ ఇంటర్నేషనల్‌కు చెందిన ఓటీటీ ఈరోస్‌ నౌ అలాంటి పొరపాటే చేసింది. ‘ఎరుపు అంటేనే అంతులేని విశ్వాసం. ప్రేమకు చిహ్నం. నవరాత్రి, నాలుగో రోజు రెడ్‌ కలర్‌. చూడండి ఎంత బాగున్నారో’ అంటూ ఈరోస్ నౌ కత్రినా కైఫ్‌, కరీనా కపూర్, దీపికా పడుకొనె, ప్రియాంక చోప్రా ఫొటోలను షేర్ చేసింది. హీరోయిన్ల అవుట్‌ఫిట్‌ రంగులకు మ్యాచ్‌ అయ్యే డ్రెస్సులు ధరించి తమతో ఫొటోలు పంచుకోవాల్సిందిగా నెటిజన్లను కోరింది. నవరాత్రి ఉత్సవాల్లో భాగాంగా ఆయా రోజుల్లో పసుపు, ఆకుపచ్చ, బూడిద, నారింజ, తెలుపు, ఎరుపు, నీలం, గులాబీ, ఊదా తదితర రంగులు కలిగిన దుస్తులు ధరిస్తే మంచి జరుగుతుందని నమ్ముతారు. చాలా మంది నవరాత్రి ఉత్సవాల సందర్భంగా, ఒక్కోరోజు ఒక్కో రంగు దుస్తులు ధిరస్తుంటారు. ఈ క్రమంలో ఈరోస్‌ నౌ.. తమ మాతృసంస్థ నిర్మాణ సారథ్యంలో నిర్మించిన సినిమాల్లోని హీరోయిన్ల స్టిల్స్‌ను తమ సోషల్‌ మీడియా పేజ్‌లో పంచుకుంటోంది. 

ఆ పని నెటిజన్లకు ఆగ్రహం తెప్పించింది. #BOYCOTTEROSNOWను ట్రెండ్‌ చేస్తున్నారు. పిచ్చి పిచ్చి మీమ్స్‌తో ఫొటోలు పోస్ట్‌ చేస్తున్న ఈరోస్‌ నౌ కంటెంట్‌ను వీక్షించబోమని మండిపడుతున్నారు. హిందువుల పండగలు అంటే ప్రతి ఒక్కరికీ చులకన అయిపోయిందని ఏకి పారేస్తున్నారు. మతాలకు అతీతంగా ప్రతీ సందర్భంలోనూ ఇలాంటి ఫొటోలు పోస్ట్‌ చేయగల దమ్ముందా అంటూ ప్రశ్నించారు. అంతేగాకుండా కత్రినాకు సంబంధించిన మరికొన్ని స్టిల్స్‌ షేర్‌ చేసి, పవిత్రమైన నవరాత్రుల సందర్భంగా ఇలాంటి ఫొటోలతో ఏం సందేశం ఇస్తున్నారంటూ యాంగ్రీ ఎమోజీలు పంచుకుంటున్నారు. దీంతో ఈరోస్ నౌ నెటిజన్లను క్షమాపణలు కోరింది. ఒకరి మనోభావాలను కించపరిచే ఉద్దేశం తమకు లేదని స్పష్టంచేసింది. భారత్‌లోని విభిన్న సంస్కృతుల పట్ల తమకు గౌరవభావం ఉందని, తాము షేర్‌ చేసిన పోస్టుల వల్ల ప్రజల మనోభావాలు దెబ్బతిన్న కారణంగా వాటిని తక్షణమే తొలగిస్తున్నామని తెలిపింది. ఈ మేరకు ఈరోస్‌ నౌ బృందం ట్వీట్ చేసింది. కాగా, ఇటీవల తనిష్క్‌ సైతం ట్రోలింగ్‌ బారిన పడటంతో తమ యాడ్‌ను వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే.