ఎర్రగడ్డ మాధవి డిశ్చార్జి.. 9 లక్షల ఖర్చు - MicTv.in - Telugu News
mictv telugu

ఎర్రగడ్డ మాధవి డిశ్చార్జి.. 9 లక్షల ఖర్చు

October 17, 2018

తండ్రి చేతిలో నరికివేతకు గురైన నవవధువు మాధవి పూర్తిగా కోలుకుంది. ఆమెను ఈ రోజు సోమాజిగూడ ఆస్పత్రి వైద్యులు ఆమెను డిశ్చార్జి చేశారు. చేయి, భుజంపై తీవ్ర గాయాలైన మాధవి అతి త్వరగా కోలుకోవడం తమను ఆశ్చర్యపరిచిందని వైద్యుడు దేవేందర్ సింగ్ చెప్పారు. రక్తమంతా కోల్పోయి కేవలం 3 గ్రాముల హిమోగ్లోబిన్‌తో ఆమెను ఆస్పత్రికి తీసుకొచ్చారని గుర్తు చేశారు.

Erragadda Madhavi discharged from hospital today after nearly one month treatment father Manoharachari attacked her for marrying dalit man

వీల్ చైర్‌లో మాధవిని బయటికి తీసుకొచ్చారు. చేతికి కట్టుతో ఆమె ఆత్మవిశ్వాసంతో కనిపించింది. ‘నా తండ్రిపై కఠిన చర్యలు తీసుకోవాలి.. సందీప్‌ నన్ను బాగా చూసుకుంటాడనే నమ్మకంతో అతణ్ని పెళ్లి చేసుకున్నాను.. నాలాంటి పరిస్థితి మరో అమ్మాయికి రాకూడదు’ అని ఆవేదన వ్యక్తం చేసింది.

మాధవి దళితుణ్ని పెళ్లిచేసుకుందన్న ఆగ్రహంతో తండ్రి మనోహరాచారి గత నెల 19న ఆమెపై కత్తితో దాడి చేయడం తెలిసిందే. మాధవి భర్త సందీప్ పైనా దాడి చేయగా అతడు తప్పించుకున్నాడు. కొత్త బట్టలు కొనిస్తానని నమ్మించి కొత్త జంటను ఎర్రగడ్డ గోకుల్ థియేటర్ వద్దకు పిలిపించుకుని మనోహరాచారి ఈ దారుణానికి తెగబడ్డాడు. పోలీసులు అతణ్ని అరెస్ట్ చేశారు. మాధవి చికిత్సకు రూ. 9 లక్షలు ఖర్చయిందని, ఈ మొత్తాన్ని ప్రభుత్వమే భరించనుందని సమాచారం. దాడిలో మాధవి మెడపై లోతైన గాయమైంది. మెడ నరాలు తెగిపోయి, ఎడమ చెవి సగభాగం పోయింది. ముఖ కండరాలూ దెబ్బతిన్నాయి. ఎడమ చేయి దాదాపు తెగిపోయింది.