ఉస్మానియా ప్రతిష్ట మరింత పెరగాలి.. ఎర్రోళ్ల శ్రీనివాస్ - MicTv.in - Telugu News
mictv telugu

ఉస్మానియా ప్రతిష్ట మరింత పెరగాలి.. ఎర్రోళ్ల శ్రీనివాస్

March 25, 2022

yyyyyyyw

”వందేళ్ల ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరగడం సంతోషకరం. నాతోపాటు చదువుకున్న నా స్నేహితులను ఈరోజు కలుసుకోవడం ఆనందంగా ఉంది. ఈ వర్సిటీ ఎంతోమంది మేధావులను తయారు చేసింది. మరింత అభివృద్ధి చెందాలని కోరుతున్నాను’ అని తెలంగాణ వైద్య సేవలు, మౌలిక వసతుల అభివృద్ది సంస్థ కార్పొరేషన్‌ చైర్మన్‌ డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆకాంక్షించారు. ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీలో శుక్రవారం పూర్వ విద్యార్ధుల సమ్మేళనంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. గ్రామీణ నేపథ్యం నుండి వచ్చిన తనకు ఈ యూనివర్సిటీ విద్యతోపాటు, విద్యార్థుల హక్కుల కోసం ఎలా పోరాడాలో, చదువు పూర్తి అయిన తర్వాత ఎలా బతకాలో ఓ మంచి మార్గాన్ని నేర్పిందని ఆయన పేర్కొన్నారు.

‘ఎంతోమంది గొప్ప వారిని సమాజానికి అందించి, ఈ ఉస్మానియా యూనివర్సిటీ ప్రపంచంలోనే ఆదర్శంగా నిలిచింది. ఈ కళాశాల అధ్యాపకులు నాకు ఇచ్చిన ప్రోత్సాహం మాటల్లో చెప్పలేనిది” అని అన్నారు అనంతరం కళాశాల ప్రాంగణమంతా తిరిగి, యూనివర్సిటీతో తనకున్న అనుబంధాన్ని ఉద్యమ కాలాన్ని గుర్తుచేసుకున్నారు. పూర్వ విద్యార్థులు,మేధావులు యూనివర్సిటీ ప్రతిష్టను పెంచేందుకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమానికి యూనివర్సిటీ వీసీ రవీందర్ యాదవ్, అసెంబ్లీ సెక్రటరీ నర్సింహ్మాచారి, నందిని సిద్దారెడ్డి, కంచె ఐలయ్య, అల్లం నారాయణ, ఉన్నత విద్య కౌన్సిల్ చైర్మన్ లింబాద్రి, ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ గణేష్, ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ ఉమర్ జలీల్‌ల తదితరులు పాల్గొన్నారు.