మాస్కులు కరోనా కట్టడి ఏమో కానీ.. నేరగాళ్లకు మాత్రం పక్కాగా ఉపయోగపడుతున్నాయి. పోలీసులు ఏ మాత్రం గుర్తు పట్టకుండా తమ పనులు చేసేసుకుంటున్నారు. ఇలాగే ఓ వ్యక్తి జైలు నుంచి పారిపోవడానికి మాస్కును ఆధారంగా చేసుకొని పోలీసులకే కుచ్చు టోపీ పెట్టాడు. అమెరికాలోని ఇలినాయిస్‌లోని కుక్ కౌంటి జైలులో ఇటీవల చోటు చేసుకుంది. దీంతో జైలు సిబ్బంది అప్రమత్తమై ముసుగు వీరులను ఓ కంట కనిపెడుతూ ఉన్నారు.
హెండర్సన్ అనే 28 ఏళ్ల వ్యక్తి నార్కోటిక్ కేసులో జైలుశిక్ష అనుభవించి విడుదల సమయం వచ్చింది. దీంతో అధికారులు ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. కానీ చివరి నిమిషంలో హెండర్సన్ తనకు బదులు జైలు శిక్ష అనుభవిస్తున్న జాకెజ్ స్కాట్ అనే ఖైదీని బయటకు పంపాలని భావించాడు. దీని కోసం అతడితో ఏకంగా వెయ్యి డాలర్లతో ఒప్పందం చేసుకున్నాడు. ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు మాస్కు ధరించి అధికారుల వద్దకు వచ్చాడు. వారు కూడా అతన్ని హంటర్సన్‌గా భావించి విడుదల చేశారు. కానీ తీరా అసలు విషయం తెలిసి పోలీసులు అవాక్కయ్యారు. దీంతో బయటకు వెళ్లిన స్కాట్‌ను వెతికి పట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఈ వ్యవహారం జైల్లో సంచలనంగా మారింది.