నా అనుభవాలు రాస్తే ఎవరు చదువుతారు?: నరసింహన్
దాదాపు పదేళ్లపాటు తెలుగు రాష్ట్రాల గవర్నర్ గా పనిచేసిన ఈఎస్ఎల్ నరసింహన్ గత స్మృతులను నెమరేసుకున్నారు. తెలంగాణ గవర్నర్ పదవి నుంచి తప్పునుని విశ్రాంతి తీసుకోనున్న ఆయన ఈ రోజు రాజ్ భవన్‌లో విలేకర్లతో పిచ్చాపాటీగా మాట్లాడారు. తాను నిష్పక్షపాతంగా విధులు నిర్వహించానని చెప్పుకొచ్చారు. చాలా సంతోషంగా వెళ్తున్నానని, సహకరించిన వారందరికీ ధన్యవాదాలు చెబుతున్నానని పేర్కొన్నారు. అసలు తాను గవర్నర్‌ను అవుతానని అనుకోలేదని, అయ్యాక ప్రజల అభిమానం పొందానని అన్నారు. గవర్నర్‌గా తన అనుభవాలు అక్షరబద్ధం చేసే అంశంపై స్పందిస్తూ.. రాస్తే ఎవరు చదువుతారని సరదాగా అన్నారు.
నరసింహన్ ఏమన్నారో ఆయన మాటల్లోనే..
‘గవర్నర్‌గా నా బాధ్యతలను నేను చక్కగా నిర్వర్తించాను. ఏ వర్గానికి, ఏ పార్టీకీ అనుకూలంగా పనిచేయలేదు. తెలంగాణ, ఏపీ పార్టీలు , నాయకులు, ప్రజలు నాకు ఎంతగానో సహకరించారు. అయితే కొన్ని విషయాలు బాధ కలిగించాయి. కొందరు అనవసర విమర్శలు చేశారు. విమర్శలు తప్పుకాదు, కానీ అవి నిర్మాణాత్మకంగా ఉండాలి. కొందరు ముఖ్యమంత్రులతో చిన్నచిన్న విభేదాలు సాగినా వాళ్లంతా మంచివారే. ఇంట్లోనే విభేదాలు ఉంటాయి కదా. శ్రీకృష్ణ రిపోర్ట్ డిసెంబర్ 31 న వచ్చినప్పుడు ‘రేపేంటి సర్? అని ఓ విలేకరి అడిగారు. నేను జనవరి ఒకటి అన్నాను. దీంతో నన్ను తెలంగాణ వ్యతిరేకి అని వార్తలు రావారు. రాష్ట్ర విభజన తర్వాత రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడి ఏకతాటిపైకి వెళ్లేలా చూశాను. నేను గుళ్లకు వెళ్లడంపై కొందరు విమర్శలు చేశారు. వ్యక్తిగత జీవితంపై వార్తలు రాయడం బాధ కలిగించింది. నేను గుడికి వెళితే తప్పేంటి?’
ఒక్క బుల్లెట్ పేలకుండానే
‘తెలంగాణ ఉద్యమం సందర్భంగా శాంతి భద్రతలను పరిరక్షించాను. పోలీసులు ఒక్క బుల్లెట్ కూడా పేల్చలేదు. బాష్పవాయు గోళాలు, వాటర్ కేనాన్స్ వంటి తక్కువ హాని కలిగించే సాధనాలతోనే పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
చించినోళ్లతోనే మంత్రులుగా ప్రమాణం చేయించాను..
నేను ఎవరిపైనా పక్షపాతం చూపలేదని, చివరికి నా ప్రసంగాన్ని చించిన వాళ్లతోనే మంత్రులుగా ప్రమాణం చేయించాను. ధర్మంతో ఉన్నప్పుడు సంకటం ఉండదు. విమర్శలు సహజం. నా ముఖానికి ఎవరో హీరో బాడీతో మార్పింగ్ చేసి వార్త ఇచ్చారు. దాన్ని చూసి నేను నవ్వుకున్నాను.. తెలంగాణకు బంగారు భవిష్యత్తు ఉంది..’ అని నరసింహన్ చెప్పారు. తెలంగాణ గవర్నర్‌గా తమిళనాడు బీజేపీ చీఫ్ తమిళసై సౌందరరాజన్‌ను కేంద్రం నియమించడం తెలిసిందే.