Establishment of 'Night Sky Sanctuary' in Ladakh
mictv telugu

దేశంలో తొలిసారిగా ‘నైట్ స్కై శాంక్చుయరీ’ ఏర్పాటు

September 5, 2022

దేశంలోనే తొలిసారిగా నైట్ స్కై శాంక్చుయరీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. లద్దాఖ్‌లోని హాన్లే ప్రాంతంలో ఏర్పాటు చేయబోయే ఈ పరిశోధనా కేంద్రంలో ఆప్టికల్, ఇన్‌ఫ్రారెడ్, గామా రే టెలిస్కోపులను ఏర్పాటు చేస్తారు. ఈ ప్రాంతం మానవ సంచారానికి దూరంగా ఉండడంతో పాటు ఆకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఏడాది పాటు పొడి వాతావరణం, అత్యంత ఎత్తైన ప్రదేశం వంటి అంశాలు అనుకూలంగా ఉండడంతో ఈ ప్రదేశాన్ని ఎంపిక చేశారు. ఖగోళ పరిశోధనలు, తద్వారా ఖగోళ పర్యటనను ప్రోత్సహించాలని కేంద్రం భావిస్తోంది. ఈ మేరకు లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంత యంత్రాంగం, లద్దాఖ్ అటానమస్ హిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ మధ్య త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది. ఈ పరిశోధనా కేంద్రం ఏర్పాటుతో మన దేశం అగ్రరాజ్యాల సరసన నిలుస్తుందని చెప్పవచ్చు.