బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పార్టీ మారబోతున్నారంటూ గత కొంతకాలంగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. బీజేపీలో ఇమడలేకపోతున్నారని ..త్వరలోనే బయటకు వచ్చేస్తారంటూ వార్తలు వచ్చాయి. ఇటీవల ఈటల చేసిన కోవర్టు వ్యాఖ్యలపై సొంత పార్టీ నేతల నుంచి వ్యతిరేకత రావడంతో మరోసారి పార్టీ మార్పు వార్తలు గుప్పుమన్నాయి. అయితే పార్టీ మారబోతున్నారంటూ వస్తున్న వార్తలను ఈటల రాజేందర్ ఖండించారు.
తాను పార్టీ మారేది లేదని తేల్చి చెప్పారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో సోమవారం జరిగిన పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశాంలో ఆయన మాట్లాడారు. కావాలనే సీఎం కేసీఆర్ తనపై దుష్ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు. “నేను ఒక పార్టీని నమ్ముకుంటే చివరిదాకా కొనసాగుతాను.కేసీఆర్ వెళ్లగొడితే బీజేపీ నన్ను అక్కున చేర్చుకుని సముచిత స్థానం కల్పించింది. ఇతర పార్టీల్లో చిచ్చుపెట్టి గెలిచేందుకు ఆయన చిల్లర రాజకీయాలకు తెరలేపారు” అని ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఈటల స్పష్టం చేశారు.