మొదలైన జగన్నాథ రథ యాత్ర.. భక్తులకు అనుమతి - MicTv.in - Telugu News
mictv telugu

మొదలైన జగన్నాథ రథ యాత్ర.. భక్తులకు అనుమతి

July 1, 2022

ఒడిశాలో రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పూరీ జగన్నాథ ఆలయంలో నేడు జగన్నాథ రథ యాత్ర మొదలైంది. రేండేండ్ల తర్వాత శుక్రవారం గుడి తలుపులు తెరుచుకోవడంతో ఇప్పటికే వేలాది మంది భక్తులు పూరీ జగన్నాథ ఆలయానికి చేరుకున్నారు. హిందూ క్యాలెండర్ ప్రకారం జగన్నాథ రథయాత్ర ప్రతి సంవత్సరం ఆషాఢ శుక్ల పక్షం రెండవ రోజున ప్రారంభమై, ఏకాదశి వరకు కొనసాగుతుంది. ఈ సంవత్సరం ఆషాఢ శుక్ల పక్ష ద్వితీయ జూలై 1వ తేదీ అంటే శుక్రవారం వస్తుంది. అందుకే ఈ రోజు నుంచి రథయాత్ర ప్రారంభం కానుంది. జూలై 10న ఏకాదశి రోజున రథయాత్ర ముగుస్తుంది.

 

ఈ క్రమంలో జగన్నాథ రథ యాత్ర తొమ్మిది రోజులపాటు జరుగుతుంది. ఈ యాత్రలో సోదరుడు భలభద్రుడు, సోదరి సుభద్రతో కలిసి జగన్నాథుడు రథయాత్రతో భక్తులకు దర్శనం ఇస్తాడు. అయితే, కొవిడ్ మహమ్మారి కారణంగా గత రెండేళ్లపాటు జగన్నాథ రథ యాత్రకు భక్తులను అనుతించలేదు. ఈ సంవత్సరం కరోనా తగ్గడంతో రెండు సంవత్సరాల తర్వాత ఈసారి పూర్తి స్థాయిలో భక్తులను అనుమతిస్తున్నట్లు ఒడిశా ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. దాంతో ఒడిశా రాష్ట్రం భక్తులతో కళకళలాడుతుంది.

మరోపక్క ఈసారి జగన్నాథ రథయాత్రకు సుమారు 10 లక్షల మంది తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇతర మతాల వారు, జగన్నాథ ఆలయంలోకి ప్రవేశం లేని విదేశీయులు కూడా త్రిమూర్తుల దర్శనం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని ఒక అధికారి తెలిపారు. రథయాత్ర సజావుగా సాగేందుకు అధికారులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆలయం చుట్టుపక్కల వెయ్యి మంది పోలీసులు, 180 ప్లాటూన్ల సాయుధ బలగాలతో పహరా కాస్తున్నారు. ఆలయం గ్రాండ్ రోడ్, ఇతర ప్రదేశాలలో దాదాపు 50 సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.