Etela rajender Effect On Munugode Result
mictv telugu

మునుగోడు మొనగాడు ఈటల…ఎందుకో తెలుసా?

November 6, 2022

ఒక్కడు ఒకవైపు..వందమంది ఒకవైపు. ఒకప్పుడు మిత్రులు..ఇప్పుడు ప్రత్యర్థులు. హుజూరాబాద్ గెలుపుతో తొడగొట్టిన ఈటల రాజేందర్..మునుగోడులో బీజేపీని అన్నితానై నడిపించారు. నగారా మోగకముందే మునుగోడు వార్‌లోకి దూకారు. అదరబెదరలేదు. యుద్ధం వైపు అడుగు వేశారు. కసితో రగిలిపోయారు. అధికార పార్టీకి ముచ్చెమటలు పట్టించారు. మూమూలుగా కాదు హై వోల్టేజ్ రేంజ్‌లో.మునుగోడు తీర్పు ఎలా ఉన్నా మొనగాడుగా నిలిచారు. అత్తగారు ఊరులో కారు స్పీడ్‌కు బ్రేక్ వేశారు. అక్కడ బీజేపీకి లీడ్ తెప్పించారు.

ఒకే ఒక్కడు
మునుగోడు వార్‌లో బీజేపీకి ఈటల రాజేందర్ దిక్సూచి అయ్యారు. వ్యూహాలకు పదను పెట్టి ఊరూరా తిరిగారు. ఈటల మార్క్ రాజకీయం నడిపించారు. అధికారిక పార్టీ టీఆర్ఎస్ ఎత్తుకు పై ఎత్తులు వేశారు. దబ్బాక, హుజూరాబాద్‌కు మించి ప్రణాళిక రచించారు. ఓ దశలో అభ్యర్థి, బీజేపీ అగ్రనేతల్ని మించి బై పోల్‌ని ప్రిస్టేజ్‌గా ఈటల తీసుకున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలుపుకోసం సర్వశక్తులూ ఒడ్డారు. ఓటు బ్యాంకు లెక్కల్ని ఎప్పటకప్పుడు సరిచేస్తూ కమలం సేనను నడిపించారు. తాను ఇన్ ఛార్జ్ గా ఉన్న మండలంతోపాటు మిగతా మండలాల్లోనూ ప్రభావం చూపారు. అత్తగారు ఊరిలో కారుజోరుకు బ్రేక్ వేశారు. ఇక్కడ బీజేపీని ఆధిక్యంలో నిలిపారు.

కేసీఆర్ పై కసితో…

హుజూరాబాద్‌ని మించి మునుగోడు బైపోల్‌ని ఈటల రాజేందర్ తీసుకున్నారు. కేసీఆర్ పై ఉన్న కసితో కమలాన్ని కదనరంగంలో సేనానై నడిపించారు.కేసీఆర్‌ని అప్పట్లో బాగా దగ్గర్నుంచి చూసిన ఈటల… వ్యూహ్యాలకు పదునైన ప్రతివ్యూహాల్ని పన్నారు. బీజేపీ అగ్రనేతల్ని సైతం ఒప్పించి,మొప్పించారు. మునుగోడు బీజేపీ క్యాంపెయిన్ అంటే ఈటల.ఈటల అంటే మునుగోడు బీజేపీ క్యాంపెయిన్ లెవల్లో సాగింది. ఇదే కాదు తన సామాజిక వర్గం ముదిరాజ్ ఓట్లు ఈటల బలం. బీజేపీకి ఇది ప్లస్ అయింది. ఇంచు,మించు గెలుపొటముల్ని డిసైడ్ చేసే దశలో ముదిరాజులు ఉన్నారు. ఈ ఓట్లన్నీ బీజేపీకే పడేలా ఈటల రాజేందర్ శతవిధలా ప్రయత్నించారు.

ఈటల భార్య ఇక్కడివారే…
మునుగోడులో గట్టి పట్టున్న ఈటల రాజేందర్.. గెలుపు కోసం తనదైన శైలిలో వ్యూహాలను అమలు చేశారు. మునుగోడుతో ఈటలకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఆయన భార్య జమునా రెడ్డి ఇదే నియోజకవర్గానికి చెందిన వ్యక్తి. ఫలితంగా ఈటల వివాహం అయిన నాటి నుంచే… మునుగోడు నియోజకవర్గంతో టచ్ ఉంది. దీనికితోడు పలువురు ప్రముఖులు, నేతలతో కూడా ఈటలకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఇది కూడా బీజేపీకి కలిసివచ్చింది.

నైతిక విజయం మాదే :ఈటల

మునుగోడులో నైతిక విజయం బీజేపీదేనని ఈటల రాజేందర్ అన్నారు. కేసీఆర్ కుట్రల్ని సమర్థంగా తిప్పికొట్టామన్నారు. మద్యం, డబ్బులపై టీఆర్ఎస్ నమ్మకం పెట్టుకుందని విమర్శించారు. ఎటొచ్చి మునుగోడులో బీజేపీదే నైతిక విజయమని ఈటల రాజేందర్ అన్నారు.