రూ.వేల కోట్ల పంప్ హౌజ్ ల ముంపునకు సీఎం కేసీఆరే భాధ్యత వహించాలన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. శుక్రవారం సొమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జర్నలిస్టుల అధ్యయనం వేదిక ఆధ్వర్యంలో.. కాళేశ్వరం ముంపు మానవత తప్పిదమా – ప్రకృతి వైపరీత్యమా” అనే అంశంపై సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బీజేపీ తరఫున ఈటెల రాజేందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నేనే పెద్ద ఇంజనీర్నీ, నేనే పెద్ద డిజైనర్నీ అని కేసీఆర్ ఎప్పుడూ చెప్పేవారు. ఇంజనీర్లు చెప్పిన మాటలు సీఎం వినకపోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని అన్నారు. కాళేశ్వరం, SRSP రివర్స్ పంపింగ్ వల్ల ముంపునకు భాధ్యత వహించాలని అన్నారు.
చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మంథని, మంచిర్యాల వంటి పట్టణాలు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల మునిగిపోయే పరిస్థితి వచ్చిందని ఈటల రాజేందర్ విమర్శించారు. ప్రాజెక్టు కోసం భూసేకరణ చేసిన తీరు సరిగా లేదని.. అందువల్లే వేల ఎకరాల్లో పంటలు మునిగిపోతున్నాయని చెప్పారు. ఒకసారి ముంపు బారిన పడిన వారు ఆ నష్టం నుంచి కొన్నేళ్లయినా కోలుకోలేరని.. వారు ఆత్మహత్యలకు పాల్పడే ప్రమాదం కూడా ఉందని పేర్కొన్నారు. ముంపు ప్రాంతాల్లో బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్న ప్రజలకు ప్రభుత్వం అండగా నిలిచి, భరోసా కల్పించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. సుందిల్ల, అన్నారం కట్టడం వల్లనే పలు గ్రామాలు నీట మునిగాయని, దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలని అన్నారు.