etela respond on munugodu bypoll
mictv telugu

తాగించి, బెదిరించి గెలిచారు : ఈటల

November 6, 2022

మునుగోడులో గెలిచేందుకు టీఆర్ఎస్ అడ్డదారులు తొక్కిందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శించారు. మునుగోడులో నైతికంగా బీజేపీనే విజయం సాధించిందని అన్నారు. శామీర్ పేటలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన ఈటల టీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు చేసారు. టీఆర్ఎస్ ఓడితే పెన్షన్లు రద్దవుతాయని మంత్రులు బెదిరించారని ఆరోపించారు. మంత్రులు పాలన వదిలి మునుగోడులో తిష్టవేశారని..ప్రత్యర్థులను ప్రచారం చేసుకోనివ్వకుండా దౌర్జన్యానికి పాల్పడ్డారని ఈటల మండిపడ్డారు.భారతీయ జనతా పార్టీ నాయకుల మీద రాళ్ల వర్షం కురిపించి, దాడులు చేయించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారన్నారు.

“వందల లారీల లిక్కర్ తీసుకువచ్చి ప్రజలకు తాగిపించారు. అనేక బెదిరింపులకు పాల్పడ్డారు. మహిళా సంఘాలకు,  గొల్లకురుమలకు బ్యాంకులో డబ్బులు వేసారు.  పెన్షన్లు వేస్తామని అనేక రకాల ప్రలోభాలకు గురి చేశారు. స్వయంగా మంత్రులే టిఆర్ఎస్‎కి ఓటు వేయకపోతే పెన్షన్ రద్దు అయిపోతుంది అని బెదిరించారు. రోడ్లు రావు, మోరీలు రావు, అభివృద్ధి జరగదు అంటూ భయపెట్టారు.” ఇంత చేసినా కూడా ప్రజలు అభివృద్ధి కంటే ఆత్మగౌరవం ముఖ్యమని బీజేపీకి ఓట్లు వేశారని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ నైతికంగా ఓడిపోయారని, మునుగోడు ప్రజా స్పందన తెలంగాణ ప్రజలకు మేలుకొలుపు అని స్పష్టం చేసారు.