Ethiopian Women Minister Speaking in Telugu
mictv telugu

తెలుగులో మాట్లాడిన ఇథియోపియా మహిళా మంత్రి.. షాకైన జైశంకర్

June 24, 2022

జాతుల మధ్య ఘర్షణతో ఇటీవలే మారణహోమం జరిగిన ఇథియోపియాలో మన విదేశాంగ మంత్రి జై శంకర్ పర్యటిస్తున్నారు. అక్కడ నూతనంగా నిర్మించిన భారత రాయబార కార్యాలయ భవన సముదాయాన్ని ఆయన బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆ కార్యక్రమానికి అక్కడి సామాజిక వ్యవహారాల మంత్రి ఎర్గోజీ టెస్ఫాయీ హాజరయ్యారు. ఈ క్రమంలో జై శంకర్ ఆమెతో మాట్లాడగా, ఎర్గోజీ ఇంగ్లీషుతో పాటు తెలుగులోనూ మాట్లాడడంతో ఆశ్చర్యపోయారు.

దాంతో ఆమె గురించి వివరాలు అడుగగా, తాను భారత ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ అందించే స్కాలర్ షిప్ సాధించి భారత్ వచ్చి పీహెచ్‌డీ చేశానని వెల్లడించారు. ఆయా దేశాల సంస్క‌ృతి, ఆచార వ్యవహారాలపై మక్కువ చూపూ ఎర్గోజీ ఆ క్రమంలోనే మన దేశంలో ఉండే వివిధ భాషలు, సాంప్రదాయాల గురించి చాలా తెలుసుకున్నట్టు తెలిపింది. ఈ విధంగా తెలుగు కూడా మాట్లాడడం నేర్చుకుందట. ఈ విషయాన్ని జై శంకర్ తర్వాత ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. కాగా, ఇంగ్లీషు మీడియం ప్రభావం, మోజులో పడి తెలుగువాళ్లే సరిగ్గా తెలుగు నేర్చుకోని ఈ రోజుల్లో ఆఫ్రికా దేశం నుంచి వచ్చిన ఓ మహిళ తెలుగు నేర్చుకొని చక్కగా మాట్లాడడం గమనార్హం.