s/o రామోజీరావు - Telugu News - Mic tv
mictv telugu

s/o రామోజీరావు

June 7, 2017

రామోజీ సుపుత్రుడు సుమన్ వున్నప్పుడు ఈటీవీలో ఫ్యామిలీ సీరియల్స్ తెగ వచ్చేవి. అంతరంగాలు, అందం, కళంకిత, విధి, వసుంధర, అనుబంధాలు.., వంటి సీరియల్స్ తో ఇంటింటికీ ఎందరో మహిళాభిమానులను సంపాదించుకున్న ఛానల్ ఈటీవీయేనని కచ్చితంగా చెప్పగలం. అలాంటి సుమన్ మరణంతో ఛానల్లో చెప్పుకోలేనంత మార్పు వచ్చేసింది. ఇప్పుడూ సీరియల్స్ వస్తున్నాయి కానీ అప్పటిలా కాదు.. ఎన్నాళ్ళు మహిళా ప్రేక్షకులను పట్టుకు వేళాడతాం.. యూత్ ని పట్టుకుంటే సక్సెస్ అనే నిజం రామోజీకి కొడుకు మరణం నేర్పిందా ?

ఈ టీవీ అంటేనే విలువలకు ఎంతో ఇజ్జతిచ్చేది. మరిప్పుడు ? ఒక సంస్కారవంతమైన ఛానల్ తెలుగులో ఏదైనా వుందా అంటే.. ముందు వరసలో ఈ టీవీయే నిలబడేది. సంస్కారం ప్లస్ సభ్యతను మిక్స్ చేసి తీసి దాని మీద తెలుగుదనాన్ని గార్నిష్ చేసినట్టు నిండుగా, తొలకని పాల కుండలా ఉండేవి ఈ టీవీ ప్రసారాలు. ఆడవాళ్ళ ఆరాధ్య దేవతగా ఈ టీవి ప్రసిద్ధిగాంచింది ఒక రేంజ్ లో. అప్పట్లో ఇన్నర్ వేర్ అడ్వర్టైజ్ లు వేయడానికి అస్సలు ఒప్పుకోని మహా పవిత్రమైన ఛానల్ గా ఉండింది. ఎక్కడా హింస, అసభ్యతకి తావు లేకుండా నీట్ గా క్లీన్ యూ సర్టిఫికేట్ ని స్ర్కీన్ మీద పట్టుకొనే ప్రసారాలు జరిపినట్టు అన్పించేది అప్పటి సీరియల్స్ టైటిల్ సాంగ్స్ ఇప్పటికీ ప్రేక్షకుల నాలుకలపై నర్తిస్తున్నాయంటే బికాజ్ ఆఫ్ ఈటీవీ. సీరియల్స్ స్థాయిని సినిమా స్థాయికి ఏ మాత్రం తగ్గకుండా పెంచిన ఛానల్ ఈ టీవీ.. అలాంటి సంస్కారవంతమైన ఈటీవీకి ఏమైంది ?

కొడుకు పోగానే వేరే ఏదైనా శక్తి వచ్చి ఈటీవీని బూనిందా వదలకుండా ? నో నో నో.. మంచి ఎప్పటికీ చెడిపోవడానికి వీల్లేదని పాపం మహిళామణలు వాపోతున్నారు. ఉర్దూలో ఒక సామెత చెప్పినట్టు ‘ జ్యాదా ఇల్మ్ జాన్తా బందాహి భటక్ జాతా హై ’ అన్నట్టు ఈ టీవి అలాగే అయ్యిందా ? సంస్కారం ఎక్కువై కారిపోయిందా ? ఎలా మరి ఈ ఉపద్రవాన్ని ఆపేదెవరు ? ఆపినా ఆగే స్థితిలో వుందా ? ఏదో అన్నట్టు ‘ ఇన్నాళ్ళు కోరికల్ని లోపల లోపల చంపుకొని పైకి నిండుగా వస్త్రం చుట్టుకొని ఎంతకాలం నిగ్రహంగా నటించాలని ఒకేసారి జూలు విదిల్చిన సింహంలా బట్టలన్నీ వూడబీక్కొని తనలో నలిగిన కోరికలకు నీళ్ళు పోసి పచ్చగా చిగుర్చుకొని నడి బజార్లో అయితే ఏంటి, చౌరస్తాలో అయితే ఏంటని మతి పోగొట్టే విధంగా బూతు డాన్స్ లు చేస్తూ తనలోని కోర్కెల తాపాన్ని చల్లార్చుకుంటున్నట్టే వుందా ??

1995 లో విలువలతో టెలివిజన్ రంగంలోకి అడుగు పెట్టిందో ఇప్పుడా రివాజును కాలి కింద నల్లిని నలిపేసినట్టు నలిపేసింది. అప్ డేట్ అవాలి లేకపోతే నేను వెనకబడిపోతానేమోనని తనని తాను ఎప్పుడూ నెంబర్ వన్ ప్లేసులోనే వుంచుకోవాలనుకొని భ్రమపడి బూతు వైపు అడుగేసినట్టుంది. ‘ ఓం బూతాయనమహ.. ’ అనే తారక మంత్రమే తనకు శ్రీరామ రక్ష అనుకున్నట్టుంది పాపం పిచ్చిపిల్ల. ఇన్నాళ్ళూ నేను బుల్లితెర ప్రేక్షకులకు నూరిపోసిన నీతిస్తోత్రాలను ఆపుకొని బూతు రాగాలు ఆలపించాలని గట్టిగా శపథం బూనినట్టుంది ఈటీవమ్మ. నేను ముందు నాగలిని నేను ఎటుపోతే అటే వేరే వెర్రి ఛానళ్ళన్నీ నా వెనకాలే పరుగెత్తుకొస్తాయని కాన్ఫిడెన్సుగా అడుగు ముందుకేసింది డేరింగ్ డ్యాష్ మీటీవీ ఈటీవీ.. అలా.. అలా.. ఒక ప్రవాహంలాంటి మార్పు.. ప్రేక్షక మహాశయులను ఏమార్చే మార్పు.. బుల్లితెర రంగంలో విప్లవాత్మకమైన మార్పు.. ఒక వర్గం ప్రేక్షకులను టార్గెట్ చేసి క్యాష్ చేస్కుందామనుకునే సెల్ఫిష్ చేంజెస్.. రొటీన్ కి భిన్నమైన మార్పు.. న్యూ వెర్షన్.. న్యూ వే.. న్యూ థాట్స్.. ఆల్ న్యూ న్యూ న్యూ.. నాట్ ఈటీవీ న్యూడ్.. ఓన్లీ అవర్ కల్చర్ న్యూడ్.. ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు న్యూడ్.. సీన్ ఎండ్.. నెక్స్ట సీన్ కంటిన్యూ…

బూతు

కట్ చేస్తే.. పుట్టిన ప్రతి మనిషిలోనూ ఒక బూతోడుంటాడు. అది ఎవ్వరూ ఒప్పుకోని ఒక గొప్ప నిజం. కల్చర్ కి వ్యతిరేకంగా ఉరుకులాడాలని ఊగిసలాడే ఒకే ఒక్క పదం బూతు. స్వేచ్ఛగా విహరించాలని ఉవ్వీళ్ళూరే బూతు నాలుగు గోడల మధ్య వుంటేనే ఆనందం, ఆరోగ్యం. అది బయటకొచ్చి నడివీధిలో బట్టలూడదీస్కొని డాన్స్ చేస్తే ఎలా వుంటుందనే ప్రశ్నకు సమాధానం టూకీగా ఈ టీవీని వీక్షస్తే సరిపోతుంది. బూతుకు బ్రహ్మరథం పట్టి, డబల్ మీనింగుని ఫుల్ ఫిల్ చేసుకోవాలని పాపం బూతు ఈటీవీని వేడుకున్నట్టుంది.
జబర్దస్త్

కట్ చేస్తే ఇప్పుడు ఈ టీవీ పే..ద్ద పతిత్తు ఛానల్ అయిపోయింది ? ఆస్మాసె జమీన్ కు దిగజారిన నెంబర్ వన్ ఛానల్ గా కొత్త అవతారమెత్తిన ఈనాడు టెలివిజన్. దాదాపు రెండు దశాబ్దాలుగా ఆడిన సంస్కృతి, సంప్రదాయాల ట్రాష్ కు బ్రేక్ చెప్పి బూతు అవతారమెత్తి చెలరేగిపోదామనుకుందేమో. అందుకోసం మల్లెమాల ప్రొడక్షన్ వాళ్ళు తమ వంతుగా పూర్తి సహకారం అందించి ఈటీవీని నంబరేక్ చిందిచోర్ ఛానల్ గా తయారు చేసింది. అటు చూస్తే మల్లెమాల ప్రొడక్షన్ కూడా మహా మహా నీట్ నెస్ సినిమాలు తీసి వినుతికెక్కిన సంస్థ. అందుకే వాళ్ళకీ విసుగెత్తినట్టుంది ‘ ఛీ నీ యయ్య నిండుదనం.. ఎప్పటిదాక బూతును సినిమాల్లోనే చూపించాలి బుల్లితెర మీద కూడా చూపిస్తే ఎలా వుంటుంది . అనుకొని మనీ మైండుతో వేసిన అడుగులో ఈటీవీ జత కలిసింది. ఇక్కడ చెప్పొచ్చేదేమిటంటే దొందూ దొందూ కలిస్తే రాలేది బూడిదే.. అలా రాలిన కాష్టం బూడిదే జబర్దస్త్.
రామోజీరావు గారి విలువలు వలువలు ఊడదీస్కున్నాయా ? లేకపోతే శబ్దాలయ వాళ్ళు వాళ్ళవి ఊడదీస్కొని తర్వాత రామోజీ గారివి ఊడదీసారా అనేది మిలయన్ డాలర్ల ప్రశ్న ?? స్పష్టమైన తెలుగుని తొక్కలో అనేసి జబర్దస్త్ అనే ఉర్దూ పదాన్ని టైటిల్ గా చేస్కొని హల్ చల్ చేస్తున్నారు. ఇది వాళ్ళకి గొప్ప కమర్షియల్ విజయం కావచ్చు. కమర్షియాలిటీ కోసం క్రియేటివిటీని తనఖా పెట్టడం అనేది ఒక పెద్ద బిజినెస్ స్ట్రాటజీ.
ఈ ప్రోగ్రాం సెన్సేషన్ క్రియేట్ చేసిందనే చెప్పాలి. బూతుతో కళ్ళు చెదిరే వ్యాపారం. వహ్ తారీపుల రికార్డ్స్ బ్రేక్ చేసిన రిజల్ట్స్. వాళ్ళు అనుకున్నదాన్ని పక్కా రీచ్ అయ్యారని భుజాలు ఎగరేస్కుంటున్నారేమో.. అడల్ట్స్ కామెడీతో చాలా మంది మహిళా ప్రేక్షకులకి దూరమైనా ఒక వర్గం కుర్రకారుకి ఈ ప్రోగ్రాం దిల్ జిగరైంది. మన్ పసైందైంది.

అంతర్గత జబర్దస్త్

జబర్దస్త్ షోలో విపరీతమైన రాజకీయాలు నడుస్తున్నాయని పుకార్లు ముమ్మరంగా షికార్లు చేస్తున్నాయి.. ఆ ప్రోగ్రాంకి నాగబాబు గాడ్ తో సమానం. ప్రతిరోజూ ఆర్టిస్టులు ఆయనగారి కాళ్ళు పట్టుకోనిదే స్టేజ్ మీదకు వెళ్లకూడదు. అహం వున్నవాళ్ళు గనక ఆయన కాళ్ళ భాగ్యానికి నోచుకోకుండా వెళితే వాళ్ళు ఫేమ్ అవడం చాలా కష్టంతో కూడుకున్న పని, ఫ్రేమ్ లో వుండటం ఇంకా కష్టమైన పని.. అలాగే అక్కడ ఇద్దరు ప్రోగ్రామింగ్ డైరెక్టర్లుంటారు. వాళ్ళవి కూడా కాళ్ళు పట్టుకోవాలి ఎంత పెద్దవాళ్ళైనా.. లేదంటే వాళ్ళు ఎలిమినేటింగ్ లిస్టులోకి చేరిపోతారు ? కాళ్ళు పట్టుకోవాలి, కాకా పట్టాలి పాపం అప్ కమింగ్ కామెడియన్లు. లేదంటే బాబు గారు, రోజమ్మలు అస్సలు వాళ్ళ పేర్లు ఎత్తరు. ఒకవేళ ఎత్తినా దాన్ని ఎడిటింగ్ లో లేపేస్తారు. వాళ్ళ నోటి నుంచి తమ పేరును పలికించుకోవాలని ఆర్టిస్టులు చేసే జిమ్మిక్కులు గేమ్ లా వుంటాయి.
ఇక టీం లీడర్లు ఒకప్పుడు తాము కూడా కొత్తవాళ్ళమే అన్న విషయాన్ని మర్చిపోయి జూనియర్స్ ని వాళ్ళు ట్రీట్ చేసే విధానం చాలా రాష్ గా వుంటుంది. స్కిట్లలో బూతుని పలికి పలికీ వాళ్ళ నాలకుకలకి బూతు లేకుండా మాటే రానంత మారిపోయారు. సంస్థ నుంచి గ్రూప్ లీడర్ కి డబ్బు ముడుతుంది. ఆ లీడర్ కక్కుర్తితో తను మూడు వంతులు వుంచుకొని మిగతా పాటిస్పెంట్స్ కి ఆ ఒక వంతులో ఈగలకి చెక్కర గుళికలు పంచినట్టు పంచేసి చేతులు దులుపుకుంటాడు. అలా సంపాదించి సంపాదించి ఒక్కొక్కరు కార్లు, ఇళ్ళు కొనుక్కున్నారు. సైకోల్లాంటి వాళ్ళ బిహేవియర్ ని చూసి చాలా మంది రైటర్లు అక్కడ చెయ్యలేం బాబోయ్.. ఇదొక దొంగల రాజ్యంరా నాయనా అని తోక ముడుచుకొచ్చేస్తున్నారు. అంత కష్టపడి స్కిట్ రాసిన రైటర్లకి రెమ్యూనరేషన్ ఇవ్వడానికి చచ్చిపోతుంటారు. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. అందులో లేడీ క్యారెక్టర్లు వేసేవాళ్ళంతా జఫ్ఫాలుగా మారిపోతున్నారట. మల్లెమాల వాళ్ళు టీం లీడర్ని నమ్మి ఒక స్కిట్టుకి లక్షా పాతిక వేలదాకా ఇస్తుందట. కానీ టీం లీడర్లు చాలా పెద్ద దొంగలు.. లక్ష వాళ్ళు నొక్కేసి పాతికని పంచుతున్నారు. ఈ దోపిడీని తెల్సుకొని మల్లెమాలే వారి వారి రెమ్యూనరేషన్ని ఫిక్స్ చేసి వాళ్ళే ఇస్తే మాకు న్యాయం జరుగుతుందని పాపం జబర్దస్త్ బాధితులు వాపోతున్నారు.

ఖబర్దార్ జబర్దస్త్

పచ్చి బూతులతో వీర లెవల్లో రెచ్చిపోతున్న జబర్దస్త్ కి సంకెళ్ళు పడే రోజు వచ్చేస్తోందని మహిళా సంఘాలు హెచ్చరిస్తున్నాయి. ఏ మహిళల కోసమైతే స్థాపించబడ్డ ఈటీవీ ఇప్పుడు ఆ మహిళల ఆగ్రహానికి లోనౌతోంది. ఆడవాళ్ళను కించపరిచే విధంగా వుంటున్న లత్కోర్ కామెడీకి వాళ్ళ నుంచే తీవ్ర వ్యతిరేకత ఎదురౌతోంది. ఇప్పటికే చాలా కేసులు ఫైలయ్యాయి. రేటింగ్ కూడా ఘోరంగా పడిపోయింది . దీంతో మేలుకున్న జబర్దస్త్ టీం వివాదాల కొత్త ఎత్తుగడని ప్రయోగిస్తోంది రేటింగ్ రేసులో. ఎందరికో లైఫిచ్చిన జబర్దస్త్ స్త్రీల మనోభావాలతో చెడుగుడు ఆడుకుంది. ఈటీవీ, మల్లెమాల బుద్ది తప్పినా ఆ ప్రోగ్రాంలో పాటిస్పైట్ చేసే కంటెస్టెంట్స్ కైనా బుద్ధి లేదా ? వాళ్ళ ఫ్యామిలీని పక్కన పెట్టుకొని ఆ ప్రోగ్రాం చూడగలరా ? ఎంత మీనింగ్ లెస్ మాటలవి ? అసభ్య, అక్రమ సంబంధాలతో ఆరోగ్యంగా వున్న రిలేషన్ని దెబ్బ తీస్తున్న జబర్దస్తుకి ఖబర్దార్ చెప్తున్నారు మహిళలు. పాలె నిషా అనే నర్సింగ్ అమ్మాయి ధైర్యంగా పటాస్ ప్రోగ్రాం పై తన నిరసనని తెలిపింది. ఫలితంగా రవి, శ్రీముఖిలు ఔటయ్యారు. ఇక జబర్దస్తుని కూడా ఖతం చేసే రోజు త్వరలోనే రానున్నదని మహిళల్ని కదిలిస్తే వాళ్ళల్లో ఉప్పొంగుతున్న కోపాగ్నిచెబుతోంది. నెట్టు నిండానే బోలెడంత బూతుండగా ఇంక ఛానళ్ళ నిండా కూడా ఎందుకూ రామోజీ?

పంచు బూతు కామెడీతో ఇప్పటికే సగం వరకు చెడిపోయింది వ్యవస్థ ఇంకా పూర్తిగా చెడిపెయ్యాలని కంకణం కట్టుకున్న ఈ టీవీ ఆపుతావా నీ ఓవరాక్షను ముర్దార్ కామెడీని ??

 

– సంఘీర్