కేంద్ర హోం మంత్రి అమిత్ షా రోజూ వాడే వాటర్ బాటిల్‌ను ఉద్దేశించి గోవా వ్యవసాయ మంత్రి రవి నాయక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల తమ రాష్ట్రానికి ఓ కార్యక్రమంలో పాల్గోనేందుకు వచ్చిన కేంద్రమంత్రి అమిత్ షా తాగే వాటర్ బాటిల్ విలువ తెలిసి అవాక్కయ్యానని అన్నారు. మంగళవారం ఆ రాష్ట్రంలో జరిగిన ఓ అధికారిక కార్యక్రమంలో పాల్గొన్న రవి నాయక్…భవిష్యత్తులో నీటి రేటు బంగారం, వజ్రాల స్థాయిలోకి వస్తుందని, అందుకే నీటిని సంరక్షించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. దీనికి ఉదాహరణగా కేంద్రం మంత్రి అమిత్ షా విషయాన్ని తెలియజేశారు.
ఇటీవల అమిత్ షా తన గోవా పర్యటనలో హిమాలయ వాటర్ బాటిల్ కావాలని అడిగారని, దీన్ని పనాజీకి 15 కి.మీ. దూరంలో ఉన్న మపూసా నుంచి తీసుకొచ్చామని,దీని ధర రూ.850 అని రవి నాయక్ చెప్పారు. గోవాలోని స్టార్ హోటళ్లలోనే మినరల్ వాటర్ బాటిల్ ధరలు రూ.150-160 ఉంటాయని అన్నారు. నీటి విలువ ఎంత పెరుగుతుందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చని రవి నాయక్ అన్నారు. నీటి రక్షణ కోసం ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ పర్వతాలు ఉంటే అక్కడ ఆనకట్టలు నిర్మించి నీటిని నిల్వ చేయవచ్చని అన్నారు.