every one should know who I am
mictv telugu

“నేను” ఎవరు?

January 4, 2023

"నేను" ఎవరు?

నేను అనే ఆలోచన ఏర్పడిన మరుక్షణమే నాది అనే భావన కలుగుతుంది. నేను, నాది అనేవి రెండూ చాలా ప్రమాదకరమైన పదాలు. అయినా జీవిత మంతా మనం వీటితోనే బతకాలి. ప్రపంచమంతా వీటి మీద ఆధారపడే నడుస్తుంది. పైట్టినప్పుడు ఇవి ఉండవు. చిన్నతనంలో ఉన్నా కూడా పెద్దగా జీవితం మీద ప్రభావితం చూపించేవి కావు. కానీ పెరుగుతున్న కొద్దీ ఈ భావన మనలో మరింత పెరుగుతుంది. నేను మొదలయిన చోటే నాది ఉంటుంది. దాని వెనకనే తోకలాగవస్తుంది. స్వార్థానికి నేను-నాది’రెండు రెక్కలు. ఇవి లేకపోతే అది అహం అనే తోటలో ఎగరలేదు.

నా వాహనం, నా భూమి, నా కుటుంబం, నా పిల్లలు, నా భార్య అన్నాం. అన్నీ నేనే, అన్నీ నావే. అసలే ఈ నేను అంటే ఏమిటి? ఎందుకు మనుషులలో ఈ భావన ఉంటుంది? ఇది ఎంతవరకు మంచిది. ఇదీ మనం ఆలోచించవలసిన విషయం. నేను అనే భావన కచ్చితంగా ఉండాలి. మనిషిని నడిపించేదే అది. కానీ అది మరీ ఎక్కువ అయితే స్వార్ధం అవుతుంది. దీన్ని గుర్తించడంలోనే మనిషి అన్ని పొరపాట్లు చేస్తాడు. అన్ని తప్పులూ అక్కడే మొదలవుతాయి కూడా.

నిజానికి అన్ని నేనులు కలిసి నేనైన నేనే నేను.అదే ఆత్మ… అంటే నేను ఆత్మను అని తెలుసుకోవాలి. అది అంతవరకే ఉండాలి. అంతకు మించితే అది ‘అహంభావము’ ‘అహంకారం’లకు దారితీస్తాయి. అహంకారం, అహంభావం అని రెండు రకాల పదాలు సాధారణంగా వాడుతూ వుంటాము. ఈ రెండూ ఒకే అర్థం కలిగినవి కావు. నేను కాని దాన్ని నేననుకోవడం అహంకారం. దాన్ని అలవాటుగా చేసుకుని ఇతరుల మీద చూపించడం అహంభావం.

ఇది నాది అనుకుంటే హక్కు ఉనట్టు, నాకు మటుకే సొంతం అనుకుంటే స్వార్ధం ఉన్నట్టు. నేను చేయగలను అనుకుంటే ఆత్మ విశ్వాసం, నేనే చేస్తున్నాను నేను మటుకే చేయగలను అనుకుంటే అహంకారం. ఈ నేను అనేది ఓ శక్తి. మనావునికి మాత్రమే దక్కిన ఆలోచనాశక్తి. ఎందుకంటే ఆ ఆలోచన విధానమే నీ స్థాయిని ఇహపర లోకాలలో నిర్ణయిస్తుంది. నీ ఆలోచనా విధానంలో సత్యం, న్యాయం, ధర్మం ఉంటే నీ బుద్ధికి తగట్టు దైవం నీకు తోడు గా నడుస్తుంది. మళ్ళీ ఇక్కడ దైవం అంటే అదేదో ఎక్కడో ఉంటాడు. మనకేదో చేసేస్తాడు అని కాదు. మన జీవినవిధానమే దైవం. మన మానవత్వమే దైవత్వం అన్న విషయం మర్చిపోకూడదు. బుద్ధి అహంకారంతో నిండిపోయి నేను రాక్షసుడిగా జీవిస్తానా, లేక మానవుని గానా అనేది ఈ నేను అనే నేను నిర్ణయించుకోవాలి.

రాక్షసుడు, దేవుడు అనే వారు ఎక్కడో లేరు మన జీవన విధానం లోనే ఉన్నారు. మానవుడు తన స్థాయి తగ్గించుకుని జీవిస్తే అదే రాక్షసుడు. మానవుడు తన కంటే ఉన్నతమైన లక్ష్యాలతో జీవిస్తే అతనే భగవంతుడు. చివరికి మానవుడు మన జీవన విధానంలోనే ఉన్న దేవుని వదిలి ఎక్కడెక్కడో వెతుకుతున్నాడు. ఈ జీవితం ఓ అద్భుతం, ఓ వరం. జీవించడమే గొప్ప సాధన.జంతువు, పురుగు, పక్షి, పాము, చెట్టు… అన్నీ స్వార్థం లేక జీవిస్తున్నాయి. మరి మనమెందుకిలా? నేను అనేది లేకుండా హాయిగా జీవించలేకపోతున్నాం..? బుద్ధి కలిగి ఉండటం మనిషికి వరం, శాపం కూడా. తమకు బుద్ధి ఉందనుకుని తెలిసీ తప్పులు చేస్తున్నారు మనుషులు. చిన్న ‘నేను’ నుంచి పెద్ద ‘నేను’కు ఎదగలేకపోతున్నారు. చిన్న నేను నుంచి పెద్ద నేనుకు సాగడమే జీవితం. అదే మన జీవన లక్ష్యం.

సరిగ్గా జీవిస్తే మానవత్వం వెల్లివిరుస్తుంది. గొప్పగా జీవిస్తే దివ్యత్వం కనిపిస్తుంది. జీవించడంలో ఉండే మాధుర్యాన్ని ముందుగా తెలుసుకోవాలి. జీవన సౌందర్యంలో ఉండే తాత్వికతను గుర్తించాలి. ఆటుపోట్లతో, హెచ్చు తగ్గులతో, సుఖ దుఃఖాలతో ఎలాంటి జీవితం వచ్చినా తలవంచుకుని అనుభవించాలి. నేల విడిచి సాము చేసినట్లు జీవితాన్ని గాలికి వదిలెయ్యకూడదు. జీవితంతో చక్కటి ప్రయాణం చేస్తే సాధన శిఖరాలకు చేరినట్లే. ‘ఒక దీపం మరో దీపాన్ని వెలిగించినట్లు పదిమంది జీవితాల్లో కాంతిని నింపాలి.