మేఘాలయ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఈనెల 27న 60 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. పార్టీలన్నీ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. బీజేపీ ఈ సారి సత్తాచాటాలని భావిస్తోంది. ఇందుకోసం ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎర్నెస్ట్ మౌరీ దూకుడు పెంచారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. మేఘాలయలో దాదాపు ప్రతి ఒక్కరూ బీఫ్ తింటారని తెలిపారు. తాను కూడా బీఫ్‌ను తింటానని సంచలన ప్రకటన చేశారు. బీజేపీలో ఉన్న తనకు ఎలాంటి సమస్య రాలేదన్నారు. రాష్ట్రంలో బీఫ్ తినకుండా ఉండేందుకు ఎటుంటి ఆంక్షలు లేవని తెలిపారు. ఇది రాష్ట్ర ప్రజల ఆహారపు ఆలవాటులో భాగమని చెప్పారు. దీనిని ఎవరూ ఆపలేరని ఎర్నెస్ట్ మౌరీ తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో బీఫ్ తినొద్దని పెట్టిన ఆంక్షలపై తానేం మాట్లాడదలుచుకోలేదని పేర్కొన్నారు.
బీజేపీ క్రైస్తవ వ్యతిరేక పార్టీ అన్న ఆరోపణలపై ఆయన స్పందించారు. అవన్నీ అసత్య ప్రచారాలన్నారు. దేశంలో గత తొమ్మిదేండ్లుగా బీజేపీ అధికారంలో ఉందన్నారు. ఈ తొమ్మిదేండ్లలో దేశంలో ఒక్క చర్చిపై కూడా దాడి జరగలేదన్నారు. కేవలం ప్రతిపక్షాలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం బీజేపీపై విమర్శలు చేస్తున్నాయన్నారు. ఎన్నికల్లో ఎన్‌పీపీతో పొత్తు ఉండదని తెలిపారు. ఎన్‌పీపీ సర్కార్ గత ఐదేళ్ళలో అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు. ఇటీవల అమిత్ షా వచ్చి ఎన్‌పీపీ పొత్తు ఉంటుందని ప్రకటించగా..ఇప్పుడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు హోదాలో ఎర్నెస్ట్ మౌరీ పొత్తు లేదని చెప్పడం బీజేపీ శ్రేణులను అయోమయానికి గురిచేస్తోంది.