అందరూ అలర్ట్‌గా ఉండండి.. కేటీఆర్  - MicTv.in - Telugu News
mictv telugu

అందరూ అలర్ట్‌గా ఉండండి.. కేటీఆర్ 

October 19, 2020

Everyone be alert .. KTR.jp

హైదరాబాద్ మీద వాన రక్కసి విరుచుకుపడుతోంది. భారీ వర్షాల కారణంగా నగరవాసులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తెలంగాణ చరిత్రలోనే ఇది రెండో అతిపెద్ద వర్షం అని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. 40 ఏళ్లుగా తాను హైదరాబాదులో ఉన్నానని.. ఇంతటి భారీ వర్షాలను తాను ఎప్పుడూ చూడలేదని అన్నారు. ఆకాశానికి చిల్లు పడ్డట్టుగా వాన పడిందని.. హైదరాబాదులో సాధారణం కంటే 80 శాతం అధిక వర్షం పడిందని వెల్లడించారు. మరో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు ప్రకటించారని చెప్పారు. నగరంలో అందరూ అప్రమత్రంగా ఉండాలని సూచించారు.

హైదరాబాద్ వరదలపై జీహెచ్ఎంసీ కార్యాలయంలో మీడియాతో కేటీఆర్ మాట్లాడారు. ‘1908లో మూసీ నదికి వరదలు వచ్చాయి. అప్పుడు ఒక్కరోజే 43 సెం.మీ. వర్షం కురిసింది. మళ్లీ ఇప్పుడు అంత స్థాయిలో ఒకే రోజు వర్షం కురిసింది. ఆ తర్వాత 1916లో ఒక్క ఏడాదిలో 160 సెం.మీ. వర్షం పడింది. ఈ ఏడాది ఇప్పటికే 120 సెం.మీ. వర్షం కురిసింది. హైదరాబాదులో ప్రతి ఏడాది సగటున 78 సెం.మీ. వర్షం కురుస్తోంది. భారీ వర్షాలలో కూడా జీహెచ్ఎంసీ సిబ్బంది ఎంతో శ్రమించి పని చేస్తున్నారు. అందువల్లే ఎంతోమందిని కాపాడగలిగాం. జీహెచ్ఎంసీ సిబ్బంది మొత్తం వరద పనులపైనే వున్నారు. వరద బాధితులకు అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తున్నాం. ఇప్పటి వరకు 33 మంది చనిపోయినట్టు గుర్తించాం. మరి కొందరు తప్పిపోయినట్టుగా తెలుస్తోంది. వారి కోసం గాలింపు చర్యలు జరుగుతున్నాయి. చనిపోయినవారి కుటుంబాలకు ఇప్పటికే సాయాన్ని అందించాం. దీనిపై విపక్షాలు విమర్శలు చేయడం సరికాదు. 37 వేల కంటే ఎక్కువ కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించాం. వారికి ఆహారం, మందులు అందిస్తున్నాం. సహాయ చర్యల కోసం రూ.45 కోట్లను ఖర్చు చేశాం’ అని కేటీఆర్ తెలిపారు.
ప్రస్తుతం 80 కాలనీల్లో నీరు ఉందని.. గంట, రెండు గంటల పాటు కుంభవృష్టి కురుస్తుండటంతో అత్యధిక నష్టం సంభవిస్తోందని పేర్కొన్నారు. ఆర్థిక సాయం చేయాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వాన్ని కోరాం అని అన్నారు. వారు ఎంత వరకు సాయం చేస్తారో చూడాలని కేటీఆర్ అన్నారు.