ఫ్యాక్ట్ చెక్ వెబ్సైట్ “ఆల్ట్ న్యూస్”సహ వ్యవస్థాపకుడు జర్నలిస్ట్ మహ్మద్ జుబైర్‌ను సోమవారం ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. నాలుగేళ్ల క్రితం చేసిన ఓ ట్వీట్లో… ఓ మతానికి చెందిన వారి మనోభావాలను దెబ్బతీశారని, శత్రుత్వాన్ని ప్రేరించారన్న ఆరోపణల నేపథ్యంలో ఐపిసి సెక్షన్లు 153, 295 కింద మహ్మద్ జుబైర్‌ను అరెస్టు చేశారు. జుబైర్ అరెస్ట్‌ను ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు ప్రతీక్ సిన్హా ధ్రువీకరించారు. 2020 నాటి కేసుకు సంబంధించి ఇవాళ ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేశారని, అయితే ఆ కేసులో అరెస్ట్ చేయకుండా హైకోర్టు నుంచి జుబైర్‌కు రక్షణ ఉందని తెలిపారు. దీంతో మరో కేసులో జుబైర్‌ను అరెస్ట్ చేశారని, దానికి సంబంధించి ముందస్తు నోటీసులు గానీ, ఎఫ్ఐఆర్ కాపీ గానీ తమకు ఇవ్వలేదని ఆరోపించారు.
జుబేర్ అరెస్ట్‌ను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఓ ట్వీట్ కూడా చేశారు. “బీజేపీ యొక్క మతోన్మాదాన్ని, ద్వేషాన్ని, అబద్ధాలను బయటపెట్టే ప్రతి ఒక్కరికీ ముప్పు కలుగజేస్తుంది. నిజం చెప్పే గొంతును అరెస్ట్ చేస్తే వేల గొంతుకలు వినిపిస్తాయి. నిరంకుశత్వంపై నిజం ఎల్లప్పుడూ విజయం సాధిస్తుంది” అని ట్వీట్లో పేర్కొన్నారు. ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ కూడా జుబేర్ అరెస్ట్‌ను ఖండించారు. అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ ట్వీట్ చేశారు. ముస్లిం వ్యతిరేక మారణ హోమ నినాదాల గురించి ఢిల్లీ పోలీసులు ఏమి చేయరు కానీ ఇలాంటి విషయాల్లో చాలా వేగంగా స్పందిస్తారని ట్వీట్ చేశారు.