Everyone living in India is ‘Hindu’, says RSS chief Mohan Bhagwat
mictv telugu

‘భారతీయులందరి డీఎన్ఏ ఒక్కటే.. అంతా హిందువులే’

November 16, 2022

ఈ దేశంలో నివసించే వారంతా హిందువులేనని ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ అన్నారు. కులం, మతం ఏదైనా.. ఏ భాషైనా, ఏ ప్రాంతమైనా అందరి డీఎన్ఏ ఒక్కటేనన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో సుర్గుజా జిల్లాలోని అంబికాపూర్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భిన్నత్వంలో ఏకత్వం భారతదేశం సొంతమని ..ప్రజల మధ్య ఐకమత్యాన్ని పెంపొందించడమే హిందుత్వ సిద్ధాంతమని అన్నారు. 40 వేల సంవత్సరాల క్రితం అఖండ భారత్‌లో భాగమైన అందరి డీఎన్ఏ ఒక్కటేనన్నారు. భారతదేశాన్ని తమ ‘మాతృభూమి’గా భావించి, భిన్నత్వంలో ఏకత్వ సంస్కృతితో జీవించాలని కోరుకునే వారు, మతం, సంస్కృతి, భాష, ఆహారపు అలవాట్లు, సిద్ధాంతాలతో సంబంధం లేకుండా ఈ దిశగా కృషి చేసేవారంతా హిందువులే అన్నారు. ఇదే విషయాన్ని 1925 నుంచి ఆర్‌ఎస్‌ఎస్‌ చెబుతోందన్నారు.

ప్రతి ఒక్కరు తమ సంస్కృతి సంప్రదాయాలను పాటించాలని పూర్వీకులు మనకు చెప్పారని, ఇతరుల విశ్వాసాలు, సంప్రదాయాలను మనమంతా గౌరవించాలని అన్నారు. సొంత లక్ష్యాల కోసం ఇతరుల సంపదను దోచుకునే ప్రయత్నం చేయవద్దని హితవు పలికారు. కరోనా సమయంలో దేశమంతా కలిసి పోరాడిన విషయాన్ని భగవత్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. మన మధ్య ఎన్ని వ్యత్యాసాలు ఉన్నా..క్లిష్ట పరిస్థితుల్లో ఒక్కటిగా నిలిచి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచామని భగవత్ ఈ సందర్భంగా భారతదేశం గొప్పతనాన్ని  అభివర్ణించారు.