ఓ జెన్నీ-రాబిన్స్ ప్రేమకథ.. 75 ఏళ్లకు కలుసుకున్నారు.. - MicTv.in - Telugu News
mictv telugu

ఓ జెన్నీ-రాబిన్స్ ప్రేమకథ.. 75 ఏళ్లకు కలుసుకున్నారు..

June 13, 2019

Ex American soldier reunited with first love he met during WW2 after 75 years..

ప్రేమలో ఎడబాటు ప్రేమికులను మరింత దగ్గర చేస్తుంది అంటారు. కానీ, అది సుదీర్ఘ ఎడబాటు అయితే? అదే జరిగింది ఓ ప్రేమజంట విషయంలో. 75 ఏళ్ల తర్వాత వృద్ధాప్యంలో తిరిగి కలుసుకున్నారు. ఈ మధ్య కాలంలో వారు ఎంత మానసిక క్షోభను అనుభవించి వుంటారో అంచనా వేసుకోవచ్చు. ఇరు మనుసులు అనుక్షణం ఎంత యుద్ధం చేశాయో. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. కేటీ రాబిన్స్‌ అనే అమెరికన్‌ సైనికుడు రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జెన్నీ పియర్సన్‌ అనే ఫ్రెంచి అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. రెండు నెలల తర్వాత ఆక్సిస్‌ ఫ్రంట్‌తో యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో యుద్ధానికి తప్పనిసరిగా వెళ్లాలని భావించాడు. యుద్ధం నుంచి వచ్చాక ఆమెను తీసుకువెళతానని చెప్పి వెళ్లాడు.

రెండు నెలలే కదా అని ఆమె తేలిగ్గా తీసుకుంది. అతని రాకకోసం వేయికళ్లతో ప్రతిరోజూ ఎదురుచూడసాగింది. అప్పటివరకు జెన్నీకి ఇంగ్లీష్ రాదు. రాబిన్స్‌ తిరిగొస్తాడనే నమ్మకంతో జెన్నీ కొద్దికొద్దిగా అతడికోసం ఇంగ్లీషు నేర్చుకోవటం ప్రారంభించింది. యుద్ధం ముగిసింది.. కానీ, కొన్ని అనివార్య కారణాల వల్ల అతడు అమెరికా వెళ్లిపోవాల్సి వచ్చింది.

ఆ తర్వాత అతనికి లిల్లియాన్‌ అనే యువతితో పరిచయం ఏర్పడటం, పెళ్లి జరిగిపోవటం జరిగిపోయింది. ఈక్రమంలో జెన్నీ కూడా మరో వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. పేరుకు మాత్రమే పెళ్లి చేసుకున్నారు కానీ, వారి మనసుల్లో ఒకరంటే ఒకరికి ఆరాధనాభావం పోలేదు. మనసుల్లోని ప్రేమ చావలేదు. ఆమె ఫొటో, ఆ గ్రామం పేరు ఆధారంగా జెన్నీ కోసం రాబిన్స్ అన్వేషించాడు. ఎట్టకేలకు అతడి ప్రయత్నం ఫలించి జెన్నీని కలుసుకోగలిగాడు. అన్ని సంవత్సరాల తర్వాత ఒకరినొకరు కలుసుకున్నపుడు వారిద్దరూ భావోద్వేగానికి గురయ్యారు. ఇరువురి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ సందర్భంగా రాబిన్స్ ఆమె కళ్లల్లోకి ఆరాధానగా చూస్తూ, ఎనలేని అదే ప్రేమను వ్యక్తపరిచి మాట్లాడుతూ.. ‘నేను ప్రతిక్షణం నిన్ను ఆరాధించాను. జీవితమంతా నిన్ను ప్రేమించాను. నీస్థానం నా గుండెల్లో ఎప్పటికీ చెరిగిపోదు. నువ్వెప్పుడూ నా గుండెల్లోనే ఉన్నావు’ అని జెన్నీతో చెప్పాడు. అతడు అపురూపంగా దాచుకున్న ఫొటోను జెన్నీకి చూపించాడు. అంతే మరింత ఆరాధనగా, ఆనందభాష్పాలు కారుస్తూ జెన్నీ అతణ్ని గుండెలకు హత్తుకుంది. వారి కలయిక అక్కడున్న చాలామందిని కంటతడి పెట్టించింది.