నేరగాళ్లను శిక్షించడంలో మనకంటే వెనుకబడిన దేశాలే నయమనిపిస్తోంది. అవినీతి, రాజకీయ ప్రేరేపిత హింస, దాడులు వంటి కేసుల్లో బంగ్లాదేశ్ కోర్టులు త్వరితగతిన తీర్పులు ఇచ్చేస్తున్నాయి. వీటి వెనుక రాజకీయ ఒత్తిళ్లు, ఇతర ప్రభావాల మాటెలా ఉన్నా దుండగులు తప్పించుకోలేరన్న సంకేతాలు స్పష్టంగా వెలువడుతున్నాయి.
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా కుమారుడు, విపక్ష బీఎన్పీ తాత్కాలిక అధ్యక్షుడు తారీఖ్ రెహ్మాన్‌కు పేలుళ్ల కేసులో జీవిత ఖైదు పడింది. ఇద్దరు మాజీ మంత్రుల సహా 17మందికి మరణశిక్ష విధించారు. 2004లో ఢాకా గ్రనేడ్ పేలుళ్ల కేసులో ఢాకా కోర్టు వారిని దోషిగా తేల్చి బుధవారం శిక్షలు వేసింది. మాజీ మంత్రి లుత్‌ఫోజ్మన్, ఓ మాజీ డిప్యూటీ మంత్రికి మరణశిక్ష పడింది. 2004లో ఢాకాలో బంగ్లాదేశ్ అవామీ లీగ్ ర్యాలీ నిర్వహిస్తుండగా గ్రనేడ్ దాడి చోటుచేసుకుంది. అందులో 24 మంది చనిపోగా, ప్రస్తుత ప్రధాని షేక్ హసీనా సహా 500 మంది గాయపడ్డారు. హసీనా కొంత వినికిడి శక్తి కోల్పోయారు. మాజీ ప్రధాని జిల్లూర్ రెహ్మాన్ భార్య ఇవీ రెహ్మాన్ మృతి చెందారు. ఈ పేలుళ్ల వెనుక తారీఖ్ హస్తముందని దర్యాప్తులో తేలింది. అతడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. మరణశిక్ష పడిన మంత్రుల్లో మాజీ విద్యాశాఖ మంత్రి అబ్దుల్ సలామ్ పింటూ ఉన్నారు.