వివాహితపై అత్యాచారం, కిడ్నాప్, తుపాకీతో బెదిరింపు కేసులో అరెస్ట్ అయిన మాజీ సీఐ నాగేశ్వరరావు చర్లపల్లి జైలులో సరదాగా కాలక్షేపం చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం జుడీషియల్ రిమాండ్‌లో ఉన్న ఆయన.. తోటి ఖైదీలు, జైలు సిబ్బందితో కబుర్లు చెప్పుకుంటూ హ్యాపీగా ఉన్నట్టు సమాచారం. తప్పు చేశానన్న పశ్చాత్తాపం ఆయనలో ఏమాత్రం కనిపించడం లేదని, ఈ కేసును ఈజీగా బయటపడతానని తోటి ఖైదీల వద్ద ఆయన ధీమా వ్యక్తం చేసినట్టు తెలిసింది.
సంచలనం రేకెత్తించిన కేసులో మరిన్నివివరాలు రాబట్టేందుకు వారం కస్టడీ కోరుతూ వనస్థలిపురం పోలీసులు గురువారం న్యాయస్థానంలో పిటీషన్ దాఖలు చేశారు. న్యాయస్థానం శుక్రవారమే నాగేశ్వరరావును కస్టడీకి తీసుకునేందుకు పోలీసులకు అనుమతిచ్చిందని, ఈ మేరకు జైలులో ఉన్న అతడికి నోటీసులు కూడా జారీచేసినట్లు సమాచారం. పోలీసులు మాత్రం కస్టడీ పిటీషన్‌పై సోమవారం విచారణ జరుగుతుందంటున్నారు. కస్టడీకి తీసుకున్న తరువాతనే కేసు రీ కనస్ట్రక్షన్ చేస్తామంటున్నారు. కస్టడీకి అనుమతినిచ్చినా అదుపులోకి తీసుకోలేదనే ఊహాగానాలను పోలీసుఅధికారులు కొట్టిపారేస్తున్నారు.