Ex-CBI Officials Attend Special Screening Of 'Rocketry: The Nambi Effect'
mictv telugu

సీబీఐ మెచ్చుకున్న ‘దేశద్రోహి’ బయోపిక్.. నంబి నారాయణ్ కథేమిటి?

June 28, 2022

Ex-CBI Officials Attend Special Screening Of 'Rocketry: The Nambi Effect'

దేశం గర్వించదగ్గ ఇస్రో శాస్త్రవేత్త ఆయన. అలాంటి మహోన్నత వ్యక్తి దేశ ద్రోహిగా ఆరోపణలు ఎదుర్కొన్నారు. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎన్ని అవమానాలు ఎదురైనా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదా గొప్ప మనిషి. ఇస్రో ఛైర్మన్‌ సతీష్‌ ధావన్‌, అబ్దుల్‌ కలాంతోనూ పని చేసిన ఆయన పాకిస్థాన్ కు గూఢచర్యం చేస్తున్నారని సీబీఐ వారి చేత మాటలు కూడా పడ్డారు. చివరకు న్యాయమే గెలిచి, నిర్దోషిగా నిరూపించుకొని తిరిగి ఇస్రోలోనే అడుగు పెట్టారు. ఆయనే నంబి నారాయణన్. ఆయన జీవితం ఆధారంగా తొలిసారి రూపొందిన బయోపిక్ ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్‌’. ప్రముఖ నటుడు ఆర్‌.మాధవన్‌ దర్శకుడిగా మారి, తెరకెక్కించిన తొలి చిత్రమిది. జులై 1న విడుదలవుతోంది.

1941 డిసెంబరు 12న తమిళనాడులో ఓ మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన నంబి నారాయణన్.. మెకానికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేశారు. కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కొన్నాళ్లు స్థానికంగా ఉన్న షుగర్ ఫ్యాక్టరీలో పనిచేశారు. తనకున్న ఆసక్తితో 1966లో ఇస్రో ‘తుంబా ఈక్విటోరియల్‌ రాకెట్‌’ లాంచింగ్‌ స్టేషన్‌లో చేరి.. కొన్నాళ్లలోనే ఇస్రో ఛైర్మన్‌ విక్రమ్‌ సారాబాయ్‌ ను తన ప్రతిభతో ఆకర్షించారు. అంచలంచెలుగా ఎదుగుతూ ‘నాసా’ ఫెలోషిప్‌ను అందుకున్న ఆయన అనుకోకుండా దేశద్రోహం కేసులో ఇరుక్కున్నారు. ఆ తర్వాత ఎలా తన నిర్ధోషిగా బయటపడ్డారనే కథను ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్‌’ లో చూపించనున్నాడు మాధవన్.

ఈ సినిమాను నిన్న ఢిల్లీలోని సిరి ఫోర్ట్ ఆడిటోరియంలో సీబీఐ మాజీ అధికారుల కోసం ప్రదర్శించారు. ఆ సంస్థ మాజీ డైరెక్టర్ కార్తికేయన్‌ సహా పలువురు సీబీఐ అధికారులు, సినీ ప్రముఖులు సినిమాను చూసిన అనంతరం.. సినిమా చాలా అద్భుతంగా, ఆకర్షణీయంగా, వినోదాత్మకంగా ఉందని కొనియాడారు. సైన్స్, టెక్నాలజీ, ఎమోషన్ మేళవింపుతో అద్భుతంగా ఉందని సీబీఐ మాజీ ఇన్స్‌పెక్టర్ జనరల్ పి.ఎం.నాయర్ ప్రశంసించారు. ఎవరైతే ఆయనను దేశద్రోహిగా విమర్శించారో.. వారే నంబి నారాయణన్ దేశ ప్రగతిని కాపాడేవారిలో ముందుంటారని మెచ్చుకున్నారు. నంబి నారాయణన్‌లా ఇస్రో అభివృద్ధి కోసం తమ జీవితాన్ని అంకితం చేసిన వేలాదిమంది శాస్త్రవేత్తలకు ఈ సినిమా అంకితమని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖల కార్యదర్శి అపూర్వ చంద్ర పేర్కొన్నారు.