తెలంగాణ కాంగ్రెస్కు ఇది ఒకరకంగా నైతిక దెబ్బే. మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి, పార్టీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ భార్య పద్మినీరెడ్డి ఈ రోజు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. హైదరాబాద్లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ సమక్షంలో ఆమె కాషాయ కండువా కప్పుకున్నారు.
పరిపూర్ణానంద మహత్యం!
మోదీ నాయకత్వానికి మెచ్చే ఆమె పార్టీలో చేరారని లక్ష్మణ్ తెలిపారు. ఆమె ఆందోళ్ నుంచి పోటీ చేయనున్నట్టు తెలుస్తోంది. అయితే అందోళ్ తాజా మాజీ ఎమ్మెల్యే బాబూ మోహన్ కూడా టీఆర్ఎస్ టికెట్ ఇవ్వకపోవడంతో ఇటీవల బీజేపీలో చేరడం వల్ల వీరిద్దరి మధ్య ఘర్షణ నెలకొనే అవకాశముంది. పద్మిని బీజేపీలో చేరడంతో కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. ఇదంతా బీజేపీ స్కెచ్ అని, అమిత్ షా పర్యటించి వెళ్లిన మరుసట్రోజే ఈ పరిణామం చోటు చేసుకోవడం సందేహాలకు తావిస్తోందని అంటున్నారు. పద్మినీరెడ్డి.. శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామి శిష్యురాలని తెలుస్తోంది. ఇటీవల పరిపూర్ణానంద ఢిల్లీలో అమిత్ షా భేటీ కావడం తెలిసిందే. పద్మినీతోపాటు రాజనర్సింహ కూడా బీజేపీలో చేరేందుకు ఏర్పాట్లు సాగినట్లు సమాచారం.