ఏపీ తాజా మాజీ హోం మంత్రి మేకతోటి సుచరిత బుధవారం తాడేపల్లిలోని క్యాంపు ఆఫీసులో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని స్వయంగా వెళ్లి కలిశారు. దాదాపు గంటన్నరదాకా ఇరువురు చర్చలు జరిపారు. భేటీ అనంతరం సుచరిత బయటికొచ్చి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా విషయంపై స్పష్టతనిచ్చారు. ‘పదవిని ఆశించాను. రాకపోవడంతో ఎమోషన్‌కు గురయ్యా. రెండో మంత్రివర్గ విస్తరణ సందర్భంగా థ్యాంక్స్ గివింగ్ లెటర్ రాస్తే నా కూతురు తప్పుగా అర్థం చేసుకొని రాజీనామా లెటర్ అనుకుంది. అసలు రాజీనామా అనే ప్రశ్నే లేదు. నన్ను జగన్ తన కుటుంబ సభ్యురాలిగా చూస్తారు. నన్ను చెల్లీ అని సంబోధిస్తారు. జెడ్పీటీసీ నుంచి హోం మంత్రి దాకా తీసుకొచ్చారు. ఇంకేం కావాలి? ఒకవేళ రాజకీయాల్లోంచి తప్పుకోవాల్సిన పరిస్థితి వస్తే వైసీపీ కార్యకర్తగా కొనసాగుతా. జగన్ నిర్ణయానికి కట్టుబడి ఉంటా. ఆరోగ్యం బాగా లేకపోవడంతో గత మూడ్రోజులుగా బయటికి రాలేకపోయాన’ని వెల్లడించారు.