టీమిండియా మాజీ క్రికెటర్, మంత్రికి కరోనా.. వెంటిలేటర్‌పై.. - MicTv.in - Telugu News
mictv telugu

టీమిండియా మాజీ క్రికెటర్, మంత్రికి కరోనా.. వెంటిలేటర్‌పై..

August 15, 2020

Ex-India cricketer Chetan Chauhan on ventilator after testing positive for coronavirus and kidney failure

కరోనా వైరస్ అస్సలు ఊరుకోవడంలేదు. రోజురోజుకు తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. సామాన్య ప్రజల నుంచి వీఐపీలు, మంత్రులు, క్రికెటర్లు ఇలా ప్రముఖులు కూడా కరోనా బారిన పడుతున్న విషయం తెలిసిందే. మొన్న యూపీలో మహిళా మంత్రి కమల్ రాణి వరుణ్ కరోనాతో మృతిచెందిన విషయం తెలిసిందే. ఆ ఘటన గురించి మరిచిపోకముందే తాజాగా ఉత్తరప్రదేశ్‌ మంత్రి, టీమిండియా మాజీ క్రికెటర్ చేతన్ చౌహాన్‌ ఆరోగ్యం క్షీణించింది. ఆయనకు ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. శుక్రవారం రాత్రి నుంచి వైద్యులు వెంటిలేటర్‌పై చికిత్స చేస్తున్నారు. 

ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గత నెలలో ఆయనకు కరోనా సోకింది. పరీక్షల్లో ఆయనకు పాజిటివ్‌గా తేలింది. దీంతో ఇటీవల ఆయనను లక్నోలోని సంజయ్‌ గాంధీ ఆసుపత్రికి తరలించగా, అక్కడే చికిత్స పొందుతున్నారు. చికిత్స సమయంలోనే ఆయనకు బీపీతో పాటు కిడ్నీ సంబంధ సమస్యలు తలెత్తాయని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. కాగా, టీమిండియా తరఫున పలు టెస్ట్‌లు, వన్డేల్లో క్రికెట్ ఆడారు చేతన్ చౌహాన్‌. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ కేబినెట్‌లో మంత్రిగా ఆయన పనిచేస్తున్నారు. మరోవైపు హోంమంత్రి అమిత్ షా కరోనా నుంచి కోలుకోగా, నిత్యం ప్రజలకు కరోనా లెక్కలు చెప్పే కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్‌కు కరోనా సోకడం కలకలం రేపుతోంది.