అంబేద్కర్ వ్యతిరేకులను దేశ బహిష్కరణ చేయాలి - కొడాలి నాని - MicTv.in - Telugu News
mictv telugu

అంబేద్కర్ వ్యతిరేకులను దేశ బహిష్కరణ చేయాలి – కొడాలి నాని

May 26, 2022

కోనసీమ వివాదంపై మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని స్పందించారు. కృష్ణా జిల్లా గుడివాడలో నిర్వహించిన ‘గడప గడపకూ ప్రభుత్వం’ సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ‘ఎవరో రాసిచ్చిన స్క్రిప్టును చదువుతూ జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ రెచ్చిపోతున్నారు. చిన్న పిల్లలను రెచ్చగొడుతూ తన పబ్బం గడుపుకుంటున్నారు. రాజ్యాంగంపై అవగాహన లేని వ్యక్తులు రాజకీయాల్లోకి వస్తే ఇలానే ఉంటుంది. పేరు పెట్టే ముందు అభ్యంతరాలకు అంత సమయం ఎందుకిచ్చారని పవన్ అడుగుతున్నారు. కొత్త జిల్లాలపై అభ్యంతరాలు తెలిపేందుకు గడువు ఇవ్వడం రాజ్యంగం ప్రకారం తప్పనిసరి. అది కూడా తెలియకుండా మాట్లాడుతున్నారు. అంబేద్కర్ పేరు పెట్టాలని అందరూ కోరితేనే ప్రభుత్వం చేసింది. ఇప్పుడు ఆయన పేరును వ్యతిరేకిస్తున్న వారందరినీ దేశ బహిష్కరణ చేయాలి. లేదా జైల్లో వేయాలి. ప్రజల సంక్షేమమే తమకు ముఖ్యం తప్ప కాలిపోయిన మంత్రి, ఎమ్మెల్యేల ఇళ్లు కాదు’ అని వ్యాఖ్యానించారు.