ఫ్లెక్సీలో ఫోటో వేయలే, పార్టీ నుంచి వెళ్లిపోతా.. టీఆర్ఎస్‌కు మాజీ ఎమ్మెల్యే వార్నింగ్ - MicTv.in - Telugu News
mictv telugu

ఫ్లెక్సీలో ఫోటో వేయలే, పార్టీ నుంచి వెళ్లిపోతా.. టీఆర్ఎస్‌కు మాజీ ఎమ్మెల్యే వార్నింగ్

June 21, 2022

కేటీఆర్ కంటే సీనియర్ నాయకుడినైన తనకు పార్టీలో సరైన ప్రాధాన్యం దక్కట్లేదని అశ్వారావు పేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ నాయకత్వం ఇప్పటికైనా స్పందించకపోతే రాజీనామా చేయడానికి కూడా సిద్ధమని ప్రకటించారు. మంగళవారం స్థానిక నేతలతో కలిసి ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘పార్టీలో నాకు చాలా అన్యాయం జరుగుతోంది. ఇటీవల రాజ్యసభకు ఎంపికైన అభ్యర్ధుల ధన్యవాద సభలో పెట్టిన ప్లెక్సీలో నా ఫోటో వేయలేదు. ఇటీవల ఖమ్మంలో పర్యటించిన కేటీఆర్ చెప్పినా స్థానిక నాయకత్వంలో ఎలాంటి మార్పు రాలేదు. 1981లోనే సర్పంచ్‌గా గెలిచిన నేను కేటీఆర్ కంటే సీనియర్ నాయకుడిని. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు అంత సీన్ లేదు. తన సొంతూరిలోనే ఓట్లు వేయించలేని వ్యక్తి పక్క నియోజకవర్గాల్లో ఎలా రాణించగలడు. కేసీఆర్ ఎనిమిదేళ్ల పాలనలో గిరిజన ప్రజాప్రతినిధులకు అవమానాలే జరిగాయి. ఇప్పటికైనా పొరపాట్లు సరిదిద్దుకోకపోతే పార్టీని వదలడానికి కూడా నేను సిద్ధమే’ అని వెల్లడించారు.