‘‘నేను, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని మాట్లాడుతున్నాను. మీరు ఓ పని చేసిపెట్టాలి. మా ఆంధ్రాకు చెందిన రింకీ బూయ్ అనే ప్లేయర్ ఒకడున్నాడు. మాంచి కుర్రాడు. సపోర్ట్ చేస్తే పైకొస్తాడు. అతణ్ని మీరు స్పాన్సర్ చేయాలి. 12 లక్షల రూపాయలు నేను చెప్పే అకౌంటుకు ట్రాన్స్‌ఫర్ చేయండి. మీకు తగిన ప్రతిఫలం ఉంటుంది.’’ అని ఫోన్ వచ్చింది ముంబైలోని ఓ ఎలక్ట్రానిక్ షాపు వ్యాపారికి. సీఎంనని అవతలి గొంతు చెప్పడంతో ఠారెత్తిపోయాడు. మాట్లాడింది ముఖ్యమంత్రేనా అని డౌటొచ్చింది. కానీ పెద్దోళ్ల వ్యవహారం కదా అని ఈ గొంతు చెప్పినట్లు, డబ్బు బదిలీచేశాడు. తర్వాత, స్పాన్సర్‌షిప్ గురించి ఆరా తీశాడు. ఆ ఫోన్ నంబర్ పనిచేయలేదు. మోసపోయానని అర్థమై సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆరా తీసిన పోలీసులు ఏపీకి చెందిన బుడుమూరు నాగరాజు అనే రంజీ ప్లేయర్‌ను అరెస్ట్ చేశారు. సోమవారం కోర్టుకు హాజరుపరిచారు. నాగరాజు అక్రమాల లీలలు చాలానే ఉన్నాయని దర్యాప్తు తేలింది. ఆంధ్రా రంజీకి 2012-14 మధ్య ఆడిన నాగరాజు కొన్నాళ్లు ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ టీంకూ ఆడాడు. పలువురిని మోసంగించి భారీగా డబ్బు సంపాదించారు. ఇతనిపై ఏపీ, తెలంగాణలో పలు కేసులు ఉన్నాయి. మంత్రి కేటీఆర్ పేరుతోపాటు పలువురి పేర్లు వాడుకుని మోసాలకు తెగబడ్డాడు. 60 కార్పొరేట్ కంపెనీల నుంచి 3 కోట్లు వసూలు చేశాడు.