రక్షణ శాఖ స్కాం.. జయా జైట్లీకి  నాలుగేళ్ల  జైలుశిక్ష - MicTv.in - Telugu News
mictv telugu

రక్షణ శాఖ స్కాం.. జయా జైట్లీకి  నాలుగేళ్ల  జైలుశిక్ష

July 30, 2020

Ex-Samata Party chief Jaya Jaitly gets 4 years

 2001లో తెహల్కా న్యూస్ పోర్టల్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్‌లో బయటపడిన రక్షణ శాఖ అవినీతి కేసు ఓ కొలిక్కి వచ్చింది. ఆనాడు రక్షణ శాఖ థర్మల్ ఇమేజర్స్‌ ఒప్పందంలో అవినీతి జరిగినట్లు ఆరోపణలు ఎదురుకుంటున్న సమతా పార్టీ మాజీ అధ్యక్షురాలు జయా జైట్లీ, సమతా పార్టీ మాజీ నేత గోపాల్ పచేర్వాల్, రిటైర్డ్ మేజర్ జనరల్ ఎస్‌పీ ముర్గయి దోషులను ఢిల్లీలోని సీబీఐ కోర్టు దోషులని తేల్చుతూ నాలుగేళ్ళ జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. అలాగే రూ.1 లక్ష చొప్పున జరిమానా కూడా విధించింది. వీరు గురువారం సాయంత్రం 5 గంటలలోగా లొంగిపోవాలని స్పెషల్ సీబీఐ జడ్జి వీరేందర్ భట్ ఆదేశించారు.

భారత శిక్షా స్మృతి ప్రకారం నేరపూరిత కుట్రకు పాల్పడినట్లు, అవినీతి నిరోధక చట్టం, 1988లోని సెక్షన్ 9 ప్రకారం అవినీతి నేరారోపణలు రుజువైనట్లు వీరిలో ఒకరి తరపు న్యాయవాది విక్రమ్ పన్వర్ తెలిపారు. ప్రాసిక్యూషన్ సాక్షి గోపాల్ పచేర్వాల్ ద్వారా జయా జైట్లీ రూ.2 లక్షలు లంచం తీసుకున్నట్లు కోర్టు గుర్తించింది. ప్రాసిక్యూషన్ సాక్షికి చెందిన కంపెనీ తయారు చేసే థర్మల్ ఇమేజర్స్‌ను భారత సైన్యంకొనే విధంగా సంబంధిత మంత్రులు, అధికారులపై వ్యక్తిగత పలుకుబడితో ప్రభావం చూపే పనిని పూర్తి చేయడం కోసం ఈ డబ్బు తీసుకున్నట్లు కోర్టు గుర్తించింది. అలాగే ముర్గయి ప్రాసిక్యూషన్ సాక్షి నుంచి రూ.20,000 తీసుకున్నట్లు కోర్టు గుర్తించింది. థర్మల్ ఇమేజర్స్ కొనుగోలుగు సంబంధించి అవినీతి జరిగినట్లు కోర్టు 2012లో కేసు నమోదు చేసింది. 2006లో సీబీఐ ఛార్జిషీటు దాఖలు చేసింది. ఈ కంపెనీ ప్రతినిథి మాథ్యూ శామ్యూల్ ఈ లంచం ఇచ్చినట్లు పేర్కొంది.