పరీక్షలకు వెళ్లాలనే హడావుడి ఇద్దరు విద్యార్థుల ప్రాణాలు తీసింది. మరో ఐదుగురిని ఆసుపత్రి పాల్జేసింది. ఢిల్లీలోని పంజాబీ బాగ్ ప్రాంతంలో ఒక హోండా సిటీ కారు ఫ్లైఓవర్ మీద నుంచి కిందపడింది.
పోలీసుల కథనం ప్రకారం ఢిల్లీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రొఫెషనల్ స్టడీస్‌కు చెందిన ఇద్దరు యువతులతో సహా ఏడుగురు విద్యార్థులు నరేలాలోని ఐపీ కళాశాలలో పరీక్ష రాసేందుకు కారులో బయల్దేరారు. పరీక్షకు సమయం మించిపోతుందనే తొందరలో విపరీతమైన వేగంతో కారు నడుపుతున్నారు.
ఈ క్రమంలో కారు ఒక్కసారిగా అదుపుతప్పింది. దీంతో ఒకసారి బోల్తాపడి సమీపంలోని డివైడర్‌ను ఢీకొని గాల్లోకి లేచి ఫ్లైవోవర్ గ్రిల్‌ను బద్దలుకొట్టుకొని కిందపడిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే చనిపోయారు.
సమాచారం తెలుసుకున్న వెంటనే పోలీసులు అక్కడకు చేరుకొని కారు నుంచి విద్యార్థులను బయటకు తీశారు. కారు పైభాగం, సీట్లకు మధ్య విద్యార్థులు నలిగిపోయారు.
చనిపోయిన వారిలో కారును నడుపుతున్న 18ఏళ్ల రజత్ అనే విద్యార్థి కూడా ఉన్నాడు. ఇతనికి డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవచ్చని పోలీసులు చెబుతున్నారు. కారు ఫ్లైవోవర్‌పై కనీసం గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోందని పోలీసులు తెలిపారు. వీరి కోర్సుకు సంబంధించి రెండో సెమిస్టర్ పరీక్షలు రాసేందుకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.
HACK:
- Exam Rush kills Two Students and Five Hospitalized in Delhi Punjabi Bagh.