నూతన మద్యం పాలసీ వచ్చేస్తోందోచ్ ! - MicTv.in - Telugu News
mictv telugu

నూతన మద్యం పాలసీ వచ్చేస్తోందోచ్ !

August 21, 2017

ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి పద్మారావు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం సుమారుగా 3 గంటల పాటు సుదీర్ఘంగా సాగింది.  ముఖ్యంగా రానున్న నూతన మద్యం పాలసీ గురించి చర్చించారు. IMFL లైసెన్సులు కలిగిన వారందరితో ఒక సమావేశం పెట్టి, డ్రాఫ్ట్ పాలసీ ని తొందరగా తయారుచేయాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. డినోటిఫికేషన్ ఆఫ్ స్టేట్ హైవేస్ ప్రక్రియ ఎంత వరకు వచ్చిందని ఆరా తీశారు, చివరిగా ఎన్ని దుకాణాలు వుంటాయి, ఎన్ని దుకాణాలు షిఫ్టింగ్ చేయవలసి వుంటుంది, ఈ ప్రక్రియను త్వరితగతిగా పూర్తి చేయాలని మంత్రి అధికారులకు ఆదేశించారు.

అదే విధంగా గీతా కార్మికులకు చెట్లు ఎక్కే యంత్రాల పరిశీలన, నీరా స్టోరేజ్, మార్కెటింగ్ మరియు కల్లు గీత కార్మికులకు గుర్తింపు కార్డులు జారీ చేయడం ఎంత వరకు వచ్చిందని, ఈ ప్రక్రియ ఎందుకు జాప్యం జరుగుతుందని మంత్రి ఒకింత ఆగ్రహాన్ని వ్యక్తం చేసి, ఈ ప్రక్రియని వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశించారు.

అలాగే, ఎస్.ఐ, హెడ్ కానిస్టేబుల్ మరియు కానిస్టేబుల్ల బదిలీలు త్వరితగతిన చేయాలని అన్నారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ…. నూతన మద్యం పాలసీ పైన త్వరలోనే పూర్తి స్థాయిలో ప్రతిపాదనలు సిద్ధం చేసి  ముఖ్యమంత్రి అనుమతి తో రూపొందిస్తామని అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెరాస ప్రభుత్వం చేపట్టిన అనేక అభివృద్ది కార్యక్రమాలు బడుగు, బలహీన వర్గాలకు ఆత్మగౌరవం పెరిగిందని మంత్రి అన్నారు.

ఉమ్మడి రాష్ట్రం లో హైదరాబాద్ లో కల్లు దుకాణాలు మూసివేసి గౌడ కులస్తుల పొట్ట కొట్టిన ఘనత గత పాలకులకే చెందింది.  తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి హైదరాబాద్ లో కల్లు దుకాణాలు తెరిచి కొన్ని వేల మందికి ఉపాధి కల్పించారు. అదే విధంగా చెట్టుపై నుండి క్రిందపడి చనిపోయిన గీత కార్మికుడికి ఎక్స్గ్రేషియా కింద రూ. 2 లక్షల  నుండి రూ. 5 లక్షలకు, మరియు శాశ్వత అంగవైకల్యం కలిగిన వారికి రూ. 50 వేల నుండి రూ.5 లక్షల వరకు పెంచిన ఘనత ముఖ్యమంత్రికే దక్కిందని, అలాగే  గీత కార్మికుల అభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్నామని అన్నారు.

గీత కార్మికుల మరణాలను పూర్తి గా తగ్గించడానికి సులభంగా తాటి / ఈత చెట్లు ఎక్కే యంత్రాలను ఉచితంగా అందిస్తామని కూడా అన్నారు.