తొలిసారి విమానంలో మహిళా కూలీల తరలింపు.. గ్రేట్ సోనూసూద్ - MicTv.in - Telugu News
mictv telugu

తొలిసారి విమానంలో మహిళా కూలీల తరలింపు.. గ్రేట్ సోనూసూద్

May 29, 2020

Sonu sood

 

క‌రోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న సమయంలో సినీ నటుడు సోనూసూద్ వలస కార్మికులకు అండగా నిలబడుతున్నారు. లాక్‌డౌన్ కారణంగా వివిధ రాష్ట్రాలలో చిక్కుకుపోయి, ఇబ్బందులు ఎదుర్కొంటున్న వ‌ల‌స కార్మికుల బాధ‌లు తెలుసుకున్న సోనూసూద్ సొంత ఖ‌ర్చుతో వారిని వారివారి స్వ‌స్థ‌లాల‌కు తరలిస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌త్యేక‌ బ‌స్సుల ద్వారా కూలీల‌ను పంపిన సోనూ.. తాజాగా చార్ట‌ర్డ్ విమానంలో 151 మంది మ‌హిళా కూలీల‌ను వారి సొంతూళ్లకు పంపారు. ఒడిశాలోని భువ‌నేశ్వ‌ర్‌కి  చెందిన మ‌హిళా కూలీలు త‌మ ఉద్యోగాల‌కి రాజీనామా చేసి ఇళ్ళ‌కి వెళ్ళేందుకు సిద్ధ‌ప‌డ్డారు. వారంతా స్థానిక కేఐటీఈఎక్స్ గార్మెంట్స్‌లో కుట్టు, ఎంబ్రాయిడరీ పనులు చేస్తున్నారు. కరోనా కారణంగా ఫ్యాక్టరీ మూసివేయడంతో వారు దిక్కులేని వారయ్యారు. స్నేహితుడి ద్వారా వారి గురించి తెలుసుకున్న సోనూ వారికి సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. 

కొచ్చి నుంచి భువ‌నేశ్వ‌ర్ వెళ్లేందుకు ర‌వాణా వ్య‌వ‌స్థ స‌రిగా లేని ప‌రిస్థితుల‌లో ప్ర‌త్యేక చార్ట‌ర్డ్ ఫ్లైట్ ద్వారా వారంద‌రినీ స్వ‌స్థ‌లాలకి పంపారు. కేఐటీఈఎక్స్ గార్మెంట్స్‌లో ప‌ని చేసే 151 మందితో పాటు బ‌వ వుడ్ ఇండ‌స్ట్రీకి చెందిన 9 మందిని కూడా అదే ఫ్లైట్‌లో పంపించారు. తొలిసారి మ‌న దేశంలో వ‌ల‌స కార్మికుల‌ని విమానంలో పంపిన ఘ‌న‌త సోనూసూద్‌కే ద‌క్కింది. వలసదారుల పోరాటం తనకు తెలుసునని, ఇది నగరంలో తన ప్రారంభ రోజులను గుర్తు చేస్తుందని ఓ ఇంటర్య్వూలో సోనూ చెప్పారు. సోను తన స్నేహితుడు నీతి గోయెల్‌తో కలిసి ‘#GharBhejo’ చొరవతో మిలియన్ల మంది భారతీయుల హృదయాలను గెలుచుకుంటున్నారు. కాగా, ఇప్పటికే చాలామంది వలస కూలీలను వారి సొంతూళ్లకు పంపిన సోనూసూద్‌కు ఇంకా ఎందరో సహాయం చేయాలని అర్థిస్తున్నారు. ఈ క్రమంలో ‘మీ సందేశాలు ఎంతో వేగంగా మాకు చేరుతున్నాయి. ప్రతీ ఒక్కరికీ సహాయం చేసేందుకు మేం ప్రయత్నిస్తున్నాం. ఒకవేళ మేము ఎవరి అభ్యర్థనలైనా మిస్ చేసి ఉంటే క్షమించండి’ అని సోనూ ట్వీట్ చేశారు. మరోవైపు సాయం కోసం ఎదురుచూస్తున్న వారికి సోనూ ఓ టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేశారు.