నన్ను క్షమించండి: రష్యా అధ్యక్షుడు - MicTv.in - Telugu News
mictv telugu

నన్ను క్షమించండి: రష్యా అధ్యక్షుడు

May 6, 2022

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మొదటిసారిగా ‘నన్ను క్షమించండి’ అంటూ క్షమాపణలు కోరారు. ఈ విషయాన్ని ఇజ్రాయిల్ పీఎంవో కార్యాల‌యం ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నది. ఇటీవలే ర‌ష్యా విదేశాంగ మంత్రి ల‌వ్రోవ్ ఓ ఇంటర్వ్యూలో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్ స్కీపై కామెంట్లు చేస్తూ.. ‘నాజీ నియంత అడాల్ఫ్ హిట్ల‌ర్‌లో యూదుల వార‌స‌త్వ ల‌క్ష‌ణాలు ఉన్నాయి. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ స్వయంగా ఓ యూదుడు. అయినప్పటికీ ఆ దేశంలో నాజీయిజం ఉనికి ఉండొచ్చు” అని వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. ఆ వ్యాఖ్య‌లు ప్రపంచవ్యాప్తంగా దుమారం రేపాయి.

ల‌వ్రోవ్ చేసిన వ్యాఖ్యలపై చాలా దేశాల అధినేతలు తీవ్రంగా మండిపడుతూ, వాటిని ఖండించారు. ముఖ్యంగా ఇజ్రాయెల్‌ లావ్‌రోవ్‌ వ్యాఖ్యల్ని క్షమించరానివంటూ, వెంటనే రష్యా దేశం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. అనంతరం ఇజ్రాయెల్‌లోని రష్యా రాయబారిని పిలిపించుకుని, ల‌వ్రోవ్ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని కోరింది. దాంతో పుతిన్.. ఇజ్రాయిల్ ప్ర‌ధాని న‌ఫ్తాలీ బెన్నెట్‌కు ఫోన్ చేసి ‘ఐయామ్ సారీ’ అని చెప్పాడని ఇజ్రాయిల్ పీఎంవో కార్యాల‌యం తెలిపింది.

మరోపక్క ఉక్రెయిన్ దేశాన్ని ఆక్రమించుకోవటం కోసం పుతిన్ సైన్యాలు ఉక్రెయిన్ దేశాన్ని అల్లకల్లోలం చేస్తున్నాయి. యుద్ధం ఆపాలని ప్రపంచదేశాలు వేడుకుంటున్నా, అవేమీ పట్టించుకోకుండా పుతిన్ ఉక్రెయిన్‌పై దారుణమైన దాడులు చేయిస్తున్నాడు. ఈ క్రమంలో రష్యా సైన్యాలు ఉక్రెయిన్‌ మహిళలపై యుద్ధం పేరుతో లైంగిక దాడులు, అత్యాచారాలకు తెగబడుతున్నారు.