గుంటూరు రమ్య కేసులో శశికృష్ణకు ఉరిశిక్ష - MicTv.in - Telugu News
mictv telugu

గుంటూరు రమ్య కేసులో శశికృష్ణకు ఉరిశిక్ష

April 29, 2022

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం గుంటూరు జిల్లా పరమయ్యగుంట సెంటరు వద్ద గత సంవత్సరం ఆగస్టు 15వ తేదీన నడి రోడ్డుపై జనం చూస్తుండగా బీటెక్‌ విద్యార్థిని నల్లపు రమ్య(20)ను వట్టిచెరుకూరు మండలం ముట్లూరుకు చెందిన కుంచాల శశికృష్ణ (19) కత్తితో ఎనిమిదిసార్లు దారుణంగా పొడిచి, అక్కడినుంచి పారిపోయిన సంఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఆ ఘటన సీసీ కెమెరాలో రికార్డైంది. ఆ సమయంలో చుట్టుపక్కల జనాలు ఉన్నా, అడ్డుకోలేకపోయారు. అనంతరం రమ్యను స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించినా ఆమె ప్రాణాలు దక్కలేదు.

ఆ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, 24 గంటలు గడవకముందే శశికృష్ణను అరెస్ట్ చేశారు. సుదీర్ఘ వాదనల తర్వాత శుక్రవారం (ఈరోజు) ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిందితుడు శశికృష్ణకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. తీర్పులో భాగంగా 28 మంది సాక్షుల నుంచి వాంగూల్మం సేకరించింది. సీసీ ఫుటేజీల ప్రకారం 9 నెలల్లో కోర్ట్ విచారణ పూర్తి చేసి,సెక్షన్‌ 302 కింద ఉరిశిక్షను ఖరారు చేసిందని ప్రభుత్వం న్యాయవాది తెలిపారు.

తనను ప్రేమించడంలేదని శశికృష్ణ ఆగస్టు 15 ఉదయం 9.40కి టిఫిన్‌ తీసుకురావడం కోసం ఇంటి నుంచి బయటకు వచ్చిన.. రమ్యతో గొడవపడి కత్తితో పొడిచాడు. ప్రభుత్వాస్పత్రికి తరలించేలోగా రమ్య చనిపోయింది. ఈ హత్యను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ క్రమంలో గుంటూరు ప్రత్యేక న్యాయస్థానం ఈరోజు తీర్పును వెల్లడించింది.