exempt All Persons With Less Than ₹8 Lakh Annual Income From Income Tax ews reservations
mictv telugu

‘8 లక్షలుంటే రిజర్వేషన్లు సరే, పన్ను కూడా రద్దు చేయండి..’

November 23, 2022

వార్షికాదాయం 8 లక్షలలోపు ఉన్న అగ్రవర్ణాల వారికి 10 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం, సుప్రీం కోర్టు దాన్ని సమర్థించడం తీవ్ర వివాదాలకు దారి తీస్తోంది. ఆ లోపు ఆదాయం ఉన్నవాళ్లు ఆర్థికంగా వెనకబడిన వారైతే, ఆ ఆదాయ పరిధిలోని అందరిపైనా పన్ను కూడా రద్దు చేయాలని మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. రూ.8 లక్షల వరకు ఆదాయమున్నవారిని పేదలని చెబుతూ, రూ.2.5 లక్షల ఆదాయం దాటిన వారిపై ఆదాయపన్ను ఎలా వేస్తారంటూ డీఎంకే పార్టీకి చెందిన శ్రీనివాస్ అనే రైతు ఈ పిటిషన్ దాఖలు చేశారు.

పన్ను వసూలులో ఏమాత్రం సమంజసత్వం లేదని, పక్షపాతం చూపడం సరికాదని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ‘‘కేంద్రం తీసుకున్న రిజర్వేషన్ల నిర్ణయం ప్రాతిపదికన రూ. 7,99,999 ఆదాయం ఉన్నవారిని ఆదాయ పన్ను పరిధి నుంచి తొలగించాలి. ఆర్థిక ప్రాతిపదికతో ఒక వర్గం రిజర్వేషన్లకు అర్హులని కేంద్రం నిర్ణయించింది. అందే విధానాన్ని సమాజంలోని ఇతర వర్గాలకు కూడా అమలు చేయాలి’’ అని కోరారు. పిటిషన్‌ను విచారించిన కోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. అగ్రవర్ణాలకు 10 శాతం రిజర్వేషన్లపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. 8 లక్షల ఆదాయం వున్నవారు పేదలు ఎలా అవుతారని బీసీ, దళిత సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.